విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌ల కీలక భేటి

2

హైదరాబాద్‌,నవంబర్‌ 3(జనంసాక్షి):

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్‌, విద్య సంబంధిత తదితర అంశాలపై చర్చించినట్లు  సమాచారం. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇరువురు  ప్రధాన కార్యదర్శులు  సమావేశమయ్యారు. ఏపీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా అంబేద్కర్‌ సార్వత్రిక, తెలుగు విశ్వవిద్యాలయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు ఇవ్వాల్సిన బకాయిలపైనా చర్చించారు. అయితే ఈ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వానికి… తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యుత్‌, ఉద్యోగుల విభజనపై సీఎస్‌లు చర్చించారు. తెలంగాణ జెన్‌కో బకాయిలు రూ.1000కోట్ల ఇవ్వాలని ఏపీ సీఎస్‌ కోరారు. వాయిదా పద్ధతిలో చెల్లిస్తామన్న తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ తెలిపారు. ఏపీ నుంచి బాండ్ల రూపంలో రావాల్సిన రూ.1100 కోట్లు ఇస్తామని కృష్ణారావు చెప్పారు. అంబేద్కర్‌ వర్సిటీలో ఈ ఏడాది వరకు ఉమ్మడిగా సేవలందించేందుకు అధికారులతో చర్చించాలని సీఎస్‌లు నిర్ణయం తీసుకున్నారు.