విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..
మార్చి 17 న బయ్యారంలో ప్రారంభం,హైదరాబాద్ లో ముగింపు.
-500 మందితో ఎర్ర దండు లాంగ్ మార్చ్ పేరుతో నిర్వహణ…
-ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు చోట్ల బహిరంగ సభలు..
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు
హన్మకొండ బ్యూరో చీఫ్ 3 జనవరి
విభజన హామీలు, ఇతర ప్రజా సమస్యల సాధనకోసం సిపిఐ ఆద్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ బాల సముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎర్ర దండు లాంగ్ మార్చ్ పేరుతో 500 మందితో చేపట్టనున్న ఈ పాదయాత్ర నెల రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. మార్చి 17న మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో పాదయాత్ర ప్రారంభమై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని, ఏప్రిల్ 17న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ముగుస్తుందని తెలిపారు. బయ్యారంలో ప్రారంభమై మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని, ఈ సందర్భంగా ఆరు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.వరంగల్ ఇస్లామియా కాలేజీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, హనుమకొండ కెడిసి గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ హాజరు కానున్నారని ఆయన తెలిపారు.పాదయాత్రలో ముఖ్యంగా గడిచిన తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదని, 2014 నుండి విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం వివక్షత ప్రదర్శించిందని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వరంగల్ టెక్స్ టైల్ పరిశ్రమకు నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో భూ పోరాటాలు ఉదృతంగా సాగుతున్నాయని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే పోడు భూములకు పట్టాలివ్వాలని, సింగరేణి ప్రైవేటీకరణ నిలిపి వేయాలని, సింగరేణి ఆద్వర్యంలోనే మైనింగ్ జరుపాలని, జనగామ నుండి హైదరాబాద్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు డిమాండ్లను కూడా పాదయాత్ర ద్వారా ప్రభుత్వాల ముందు ఉంచనున్నామని తెలిపారు. తమ పాదయాత్ర ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికలు, కుర్చీల కోసం కాదని,సమస్యల పరిష్కారం కోసం అని, ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ది, పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగాల కోసమే నని తెలిపారు. కేంద్రం తన బడ్జెట్ లో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకే పెద్ద పీట వేశారని,విభజన హామీలపై ఇక్కడి బిజెపి నాయకులు స్పందించాలని అన్నారు. ఈ పాదయాత్రను, బహిరంగ సభలను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రె బిక్షపతి, బి. విజయ సారథి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మారుపాక అనిల్ కుమార్, బాషబోయిన సంతోష్ పాల్గొన్నారు.