విమర్శలను పట్టించుకుంటే అభివృద్ది సాగదు

 

 

రైతుబంధు విప్లవాత్మక మార్పుకు నాంది

రైతులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి

ఎంపి గోడం నగేశ్‌తో ముఖాముఖి

ఆదిలాబాద్‌,మే14(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్ఠాత్మకంగా వ్యవసాయ పెట్టుబడి రాయితీ కింద అందజేస్తున్న ఆర్థికసాయం వ్యవసయాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. దీనిని అర్థం చేసుకోలేని కాంగ్రెస్‌ తదితర నేతలు విమర్శుల చేయడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. అదే సందర్బంలో ఎకరానికి రూ.4 వేల రూపాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి రైతులకు సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పథకం బ్రహ్మాండంగా సాగుతోందని రైతుల ముఖాల్లో ఆనందం తొణికిసలాడుతందని అన్నారు. రైతుబంధు పథకం సాగుతున్న క్రమంపై ఆయన ప్రత్యేకంగా ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో మాట్లాడారు. కాంగ్రెస్‌ లేదా బిజెపి తదితరపార్టీలు చేసి విమర్శలరు పట్టించుకుంటే ఏ పథకం కూడా ముందుకు సాగదన్నారు. రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని ఇది ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శిగా నిలుస్తోందని ఎంపి అన్నారు. గత ప్రభుత్వాలు రైతుల సమస్యలను విస్మరించాయని అందుకే సిఎం కెసిఆర్‌ వ్యవసాయాన్ని పండగ చేయడం, కోటి ఎకరాల మాగాణా చేయడం అన్న లక్ష్యాల మేరకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని అన్నారు. అందులో భాగంగానే ముందస్తుగా ప్రకటించిన మేరకు రైతుకు పెట్టుబడిగా ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు రూ. 8 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. దేశం గర్వించేలా రైతులకు పెట్టుబడి సాయం అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతోందన్నారు. తెరాస ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ఉండి అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఇతర పార్టీల నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు నగదును చెక్కు రూపంలో అందజేస్తున్న కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోందని తెలిపారు. చెక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సర్పంచులు,రైతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని రైతులు అప్పుల పాలవకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపీ అన్నారు. దేశంలోని ఏ ప్రభుత్వాలు, రాష్టాల్ర ముఖ్యమంత్రులు చేయని విధంగా తెరాస ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భావం జరిగితే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతాయని, కరెంటు ఉండదని చీకట్లేనని వ్యాఖ్యలు చేసినా వారికి చెంపపెట్టులా తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లుగా వినూత్న పథకాలు అమలు చేశామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి అయినా రైతులకు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తి చేసి వచ్చే ఏడాదికి కోటి ఎకరాలకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుతం విఫలమైందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.