విమర్శలు మానండి..విజయం మాదే
వరంగల్ నవంబర్ 1 (జనంసాక్షి):
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు ఖాయమైందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ టిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైన నాయకుడిగా పని చేయడమే కాకుండా అవకాశాలు రాకున్న అంతే ఉద్యమ స్ఫూర్తితో పని చేసిన దయాకర్‌కు లోక్‌సభ టికెట్ ఇచ్చిన సిఎం కేసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆది నుంచి పార్టీని, కేసిఆర్‌ను నమ్ముకుని పని చేస్తున్న దయాకర్‌కు అంతే నమ్మకంతో వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని సిఎం కేటాయించారని తెలిపారు. ఒక పేద దళిత బిడ్డకు టికెట్ ఇవ్వడంతో పాటు ఎన్నికలకు అయ్యే ఖర్చును రూ.70లక్షలను ఇచ్చారన్నారు. కేసిఆర్‌ను చూసి మిగత రాజకీయ పార్టీలు నేర్చుకోవాలన్నారు. ప్రతి పక్షాలకు ఇప్పటి వరకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. గత 16 నెలలుగా ప్రజా సంక్షేమానికి ట్టుబడి ఉండి టిఆర్‌ఎస్ పార్టీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అధికారం కోల్పోయిన ప్రతిపక్షాలు భయాందోళనలతో వ్యక్తి గత విమర్శలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్ సరఫరా, ఎరువుల, విత్తనాల కొరతలు లేకుండా విజయవంతంగా టిఆర్‌ఎస్ పని చేయడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. రూ.15వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేయడం జరిగిందన్నారు. అప్పుల పాలైన రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో గిట్టుబాటు ధరలు కలిపించి రైతులకు భరోసా కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. అనేక సార్లు రైతు సమస్యలపై కేంద్రానికి నివేదిక, వినతి పత్రాలతు సమర్పించిన పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టి వేసి విమర్శిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి దేశ, విదేశాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు కేసిఆర్‌ను అభినందిస్తుంటే, ఇక్కడున్న ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తూ కాలయాపన చేస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాంనాయక్, జెడ్పి ఛైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవిందర్‌రావు, నాయకులు నన్నపనేని నరేందర్, గుడిమల్ల రవికుమార్, బూజుగుండ్ల రాజేంద్రకుమార్, ఇండ్ల నాగేశ్వర్‌రావు, వాసుదెవరెడ్డి, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.