విమానం నడుపుతున్న పదహారేళ్ళ అమ్మాయి

hariఅహ్మదాబాద్ : అహ్మదాబాద్ నగరానికి చెందిన వారిజా షా అనే పదహారేళ్ల అమ్మాయికి ద్విచక్రవాహనం నడిపేందుకు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సు రాలేదు కాని… ఆకాశంలో విమానం నడుపుతూ అందరి అభినందనలు అందుకుంది.వారిజా షా 20 నిమిషాల పాటు సెస్నా విమానాన్ని నడిపి అత్యంత చిన్న వయసులోనే స్టూడెంట్ పైలెట్ లైసెన్సు సాధించి రికార్డు సృష్టించింది. సెస్నావిమానంలో గాలిలో చక్కర్లు కొడుతూ అహ్మదాబాద్ నగరాన్ని చూడటం మర్చిపోలేని మధుర అనుభవాన్ని మిగిల్చిందని వారిజా చెప్పింది. శిక్షకుడు ఇస్తున్నసూచనలు పాటిస్తూ వేగంగా విమానం నడపడం తనకు జన్మదిన బహుమతి అంటారామె. ‘‘పైలెట్ కావాలనే కోరికతో నేను ఏడో తరగతి చదువుతున్నపుడు తల్లిదండ్రుల సహకారంతో గుజరాత్ ఫ్లైయింగ్ క్లబ్ లో చేరాను. విమానం నడపడంపై గ్రౌండుతోపాటు థీరీ తరగతుల్లో శిక్షణ పొందానని, భవిష్యత్ లో ఎయిర్ ఫోర్స్ పైలెట్ కావాలనేది నా కోరిక’’ అని వివరించారు వారిజా. వారిజా ప్రతిభ గల విద్యార్థిని అని ఆమె విమానాలు నడపడంలో ప్రావీణ్యం సంపాదిస్తుందని గుజరాత్ ఫ్లైయింగ్ క్లబ్ చీఫ్ ఫ్లైట్ శిక్షకుడు ఛార్లీ వేయిర్ చెప్పారు. వారిజా విమానం నడపటమే కాదు టెన్నిస్ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొంటుందని వారిజాషా తల్లిదండ్రులు ప్రశాంత్, పూర్వీమోదిషా చెప్పారు. తనకు టెన్నిస్ ఆడాలని, పైలెట్ కావాలని ఉండేదని, తన కోరికను తన కూతురు తీరుస్తుందని వారిజా తండ్రి ప్రశాంత్ మురిపెంగా చెప్పారు.