విలీన గ్రామాలతో జనగామ మున్సిపాలిటీ విస్తరణ
మున్సిపల్ ఎన్నికలకు ముందే రంగం సిద్దం
జనగామ,డిసెంబర్19(జనంసాక్షి): మున్సిపల్ ఎన్‌ఇనకలకు ముందే జనగామ మున్సిపాలిటీని విస్తరించే పనిలో అధథికారులు పడ్డారు. ఇప్పటికే విలీన గ్రామాల పేర్లను ప్రకటించారు. జనగామ జిల్లాగా ఏర్పడిన తర్వాత మరికొన్ని పల్లెలను కలుపుకోవాలనే ప్రతిపాదన ఉంది. పట్టణ సరిహద్దు నుంచి మూడు నుంచి ఐదు కిలో విూటర్ల వ్యత్యాసంలో ఉన్న గ్రామాలను పట్టణంలో విలీనం చేయాలనే నిబంధనలున్నాయి. దీంతో జనగామకు ఆనుకొని ఉన్న శావిూర్‌పేట, వడ్లకొండ, నెల్లుట్ల, పెంబర్తి, యశ్వంతపూర్, చీటకోడూరు, ఎల్లంల, చిక్కులోనిగూడెం వరకు కొత్తగా ఇళ్ల నిర్మాణం, కాలనీలు, విల్లాలు, ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు విస్తరించాయి. ప్రస్తుతం ఉన్న జనాభాకు తోడు కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత అధికారులు, అనధికారులు, వ్యాపారుల కుటుంబాలు అదనంగా పెరిగిన మరో పదిశాతం జనాభా, నిత్యం 20 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు పెంబర్తి నుంచి శావిూర్‌పేట విూదుగా యశ్వంతపూర్ వరకు మరో బైపాస్ రోడ్డు ప్రతిపాదన సైతం సర్వే దశలో ఉంది. ప్రస్తుతం ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న సర్వే నంబర్లు, ప్రస్తుతం మున్సిపల్‌లో కలుపుకునే వార్డులు, వాటికి సరిహద్దులతో కూడిన బహిరంగ ప్రకటనను పురపాలక సంఘం, తహసీల్, గ్రంథాలయం, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంచారు. విలీన కాలనీలు, ఇళ్లపై రూపొందించిన చిత్తు ప్రతిపాదనలను ప్రజలు పరిశీలించి వార్డుల పునర్విభజనకు సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే ఈ నెల 20వ తేదీలోగా తమకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ ఇప్పటికే ఒక ప్రకటనలో కోరారు. వచ్చే జనవరిలో తెలంగాణ సర్కార్ పంచాయతీ సమరానికి సన్నద్ధమవుతోంది. ఆ వెంటనే మార్చి నెలాఖరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు వార్డుల పునర్విభజన పక్రియలో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పట్టణ శివారు కాలనీల విలీన ముసాయిదా ప్రతిపాదనలను అధికారులు గురువారం ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల తదనంతరం
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల తంతు పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ మేరకు సంబంధిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం హైదరాబాద్‌లో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. 2014 మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగితే.. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో మే 14న ఫలితాలను వెల్లడించారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించిన మాదిరిగానే ఫలితాలు వెల్లడించి కౌన్సిల్ మొదటి సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కాకుండా పోలింగ్ తేదీని పరిగణలోకి తీసుకొని మార్చిలో మున్సిపోల్స్‌కు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఓటర్ల జాబితా సవరణ, మార్పులు, చేర్పులకు మరోసారి అవకాశం కల్పించి.. తుది జాబితా సిద్ధం చేయడంతోపాటు కావాల్సిన పోలింగ్ సిబ్బంది, పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలతో మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. పట్టణీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన తర్వాత ఇది వరకే జనగామ మున్సిపల్ వార్డుల పునర్విభజన, విలీన కాలనీలపై కసరత్తు పూర్తి చేయగా, తాజాగా ఈ అంశంపై ఏమైనా మార్పులు, చేర్పులుంటే సవిూక్షించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. జనగామ పురపాలకంలో ఏడు గ్రామ పంచాయతీలు, ఒక శివారు గ్రామాన్ని విలీనం చేసేందుకు రంగం సిద్ధమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా.. సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాకపోవడంతో ప్రస్తుతం ఉన్న 28 వార్డుల పరధిలోని శివారు కాలనీలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం విలీనం చేసుకున్న శివారు ఇళ్లు, కాలనీలన్నీ వాస్తవానికి మున్సిపల్ పరిధిలోనే ఉండగా, రికార్డుల్లో మాత్రం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వాటి విలీన తంతు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది జరిగితే పట్టణం మరింత విస్తరించడంతోపాటు జనాభా, ఓటర్లు స్పల్పంగా పెరిగి ఆయా ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు మెరుగుపడుతాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఏకైన మున్సిపాలిటీగా ఉన్న జనగామకు పరిసర గ్రామాలు, పల్లెవాసులు వలస రావడంతో పట్టణ జనాభా పెరుగుతూ వస్తోంది. దీనికితోడు విద్యా, ఉద్యోగం వంటి అవసరాల కోసం చాలా మంది జనగామలో స్థిరపడ్డారు. పెరుగుతున్న జనాభాకు తోడు కాలనీ విస్తరణ కారణంగా పట్టణ శివారు ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.