విలువలకు పాతరేస్తున్న సిఎం కెసిఆర్
ఎమ్మెల్యేల సభ్యత్వ పునరుద్దరణ చేయకుండా నిరంకుశం: శశిధర్ రెడ్డి
మెదక్,జూన్9(జనం సాక్షి ): ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దుపై నిర్ణయం తీసుకోకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న సిఎం కెసిఆర్ జాతీయస్థాయి రాజకీయాలను ఎలా నడుపుతారని, ఎలాంటి విలువలు పాటిస్తారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, పిసిస అధికార ప్రతినిధి పి. శశిధర్ రెడ్డి అన్నారు. ఇవేనా రాజకీయ మార్పులు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తూ జాతీయ రాజకీయాలు చేస్తానంటే ప్రజలు నమ్ముతారా అని అన్నారు. ప్రజలు ఎన్నకున్న ప్రజాప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశం కాక మరోటి కాదన్నారు. విలువలు చెప్పడమే కాదు ఆచరించి చూపాలన్నారు. వారి సభ్యత్వాలను రద్దు చేసే అధికారం స్పీకర్, ప్రభుత్వానికి లేదన్నారు. ఎమ్మెల్యేలసభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం ప్రభుత్వ నిరంకుశ విధానం కాదా అని మండిపడ్డారు. ఈ అంశంలో న్యాయస్థానం రెండుసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో మార్పు రావడం లేదన్నారు. న్యాయస్థానం తీర్పును పట్టించుకోని కేసీఆర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని అన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించకుండా ముఖ్యమంత్రి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలోని అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తురన్నారు.