విలువల రాజకీయానికి నిలువుటద్దం..నీలం సంజీవరెడ్డి
నేడు ఆయన వర్ధంతి సందర్భంగా…
అనంతపురం,మే31(జనం సాక్షి): భారత రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డిది ప్రత్యేక అధ్యాయం.రాజకీయాల్లో రాటుదేలడం, ప్రజలకు సేవచేయడం, పదవులకు వన్నె తేవడం వంటి లక్షణాలు కొందరికే ఉంటాయి. అలాంటి వారు రాజకీయాల్లో బహు అరుదు. పదవులకు వన్నె తెచ్చిన వారిలో దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ముందుంటారు. ఆయన లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు. 1996 జూన్ 1న ఆయన పరమపదించారు. చరిత్ర సృష్టించిన ప్రముఖుల్లో ఒకరుగా ఉన్నారు. జనతా ప్రభుత్వం హయాంలో ఆయన స్పీకర్‌గా ఉంటూ లోక్‌సభకు వన్నె తెచ్చారు. తరవాత ఆయన రాస్టప్రతిగా ప్రత్యేక ముద్ర వేశారు. కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం ప్రారంభించి, ఎమర్జెన్సీలో జయప్రకాశ్ నారాయణ పిలుపు మేరకు జనతాపార్టీలో చేరి ఉన్నత రాజకీయ విలువలకు పాటుపడ్డారు. పసదవుల కోసం ఆయన ఏనాడు వెంపర్లాడలేదు. పదవులు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. రాజకీయాల్లో అతికొద్ది మంది మాత్రమే తమ ముద్ర వేయగలిగారు. అలాంటి వారిలో నీలం కూడా ఉంటారు. రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా ఉండాలన్న ఉద్దేశంతో స్పీకర్ అయిన వెంటనే సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆదర్శప్రాయుడైన స్పీకర్ అనిపించుకున్నారు. ఇప్పటివరకు ఎన్నికైన దేశ రాష్ట్రపతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది నీలం సంజీవరెడ్డి మాత్రమే కావడం విశేషం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్క ప్రధాన మంత్రి పదవి తప్ప తక్కిన అన్ని పదవులు ఆయన అధిష్టించారు. ఎమ్మెల్యే, లోక్‌సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, భారత రాష్ట్రపతిగా ఇలా దాదాపు అన్ని పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. ఏ పదవి చేపట్టినా తనదైన ముద్రతో పాలన సాగించారు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాలు నడిపిన వ్యక్తిగా గణుతికెక్కారు. సంజీవరెడ్డి ప్రముఖ స్వాతంత్య సమరయోధులు. మహాత్మాగాంధీ పిలుపు అందుకుని 1931లో కళాశాల చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్యోద్య్రమంలో దూకారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య భూమిక వహించారు. 1940-45 మధ్య ఎక్కువ కాలం జైలు జీవితం గడిపారు. 1951 నుంచి 1953 వరకు ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వున్నారు. 1960 నుంచి 1962 వరకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా వున్నారు. 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనది. 1956 నుంచి 1960 వరకు, 1962 నుంచి 1964 వరకు రెండుసార్లు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో లాల్‌బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా, ఇందిరా గాంధీ మంత్రివర్గంలో రవాణా, పౌర విమానయాన, నౌకాయాన, టూరిజం మంత్రిగా పనిచేశారు. సంజీవరెడ్డి పుట్టింది పల్లెటూర్లో అయినా రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిని అధిష్ఠించారు. రైతు కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి పదవిని అలంకరించి ‘రైతే రాజు’ అని నిరూపించారు. చదివింది ఇంటర్ అయినా జీవిత పాఠాలు ఆయనను ఉన్నత రాజకీయ విలువలు కలిగిన నేతగా నిలిపాయి. నీతికి, నిజాయితీకి, నిర్భీతికి, నిలువుటద్దం. ఆయన పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. పదవులే ఆయన కోసం వెంటపడుతూ వచ్చాయి.నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు, వంశధార ప్రాజెక్టులు ఆయన దూరదృష్టికి నిదర్శనాలు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయన మానస పుత్రిక. పదవి ఉన్నప్పుడు పొంగిపోవడం, అది లేనప్పుడు కృంగిపోవడం అంటే ఏమిటో తెలియని స్థితప్రజ్ఞుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, దేశంలో విలువలు కలిగిన రాజకీయాలను నెరిపిన వారు.