విశ్వశాంతి, ప్రజాక్షేమం కోసమే చండీయాగం
హైదరాబాద్ : తాను నిర్వహించే అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులేనని సీఎం కేసీఆర్ వెల్లడించారు. జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో ఈనెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు కేసీఆర్ అయుత చండీయాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను మీడియాకు తెలియచేశారు. ఐదు రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారని తెలిపారు. ప్రతి రోజు వెయ్యి మందితో మహిళలతో కుంకుమార్చన కార్యక్రమం ఉంటుందని, 50 వేల మందికి అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు ఉంటాయన్నారు. వీఐపీలు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతొక్కరూ యాగానికి రావచ్చని కానీ ఆంక్షలు అతిక్రమించవద్దని సూచించారు. యాగశాల లోనికి ఎవరినీ అనుమతించడం జరగదని, దీక్షా వస్త్రాలు ధరించే వారు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వీరిని తాకితే వెయ్యి మంది మళ్లీ స్నానాలు చేయాల్సి వస్తుందని, 1500 మంది రుత్విక్కులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ వస్తే ఆయుత చండీయాగం చేస్తానని నాలుగేళ్ల కిందట సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. శృంగేరి పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, తాను కూడా ఒక యజ్ఞ కార్యకర్తనే అని తెలిపారు. అయుత చండీయాగానికి రూ 6-7 కోట్లు ఖర్చు అవుతుందని, దీనికి సంబంధించిన ఖర్చు తాను, ఇతరులు పెట్టుకోవడం జరుగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.