విషయం ఉంటే సమాధానం చెప్తా

 

న్యూఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి): తనకు బీజేపీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసులో విషయమంటే స్పందిస్తానని లేదంటే చెత్తబుట్టలో విసిరేస్తానని ప్రముఖ బీజేపీ బహిష్కృత నేత పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ నేత న్యాయవాది రాం జెఠ్మలానీ అన్నారు. పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన తాజాగా మరో లేఖాస్త్రాన్ని సంధించారు. తనపై చర్యలు తీసుకుంటే పార్టీకే నష్టమన్నారు. తనపై చర్యలు బిజెపి ఓటు బ్యాంకుకు నష్టమని జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. పార్టీ సీనియర్‌నేతలపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్టీ సహచరులు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీలపై ధ్వజమెత్తుతూ తాజాగా ఆయన లేఖ రాశారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీపైనా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. పార్టీని ముంచేయాలనే నిర్ణయం తీసుకున్నావంటూ గడ్కరీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సీబీఐ చీఫ్‌ రంజిత్‌ సింగ్‌ నియామకంలో అరుణ్‌జైట్లీ పాత్ర ఉందని ఆయన విమర్శించారు. రాజ్యసభ, లోక్‌సభలో నాయకులుగా ఉన్న వ్యక్తులు లోక్‌పాల్‌ బిల్లుపై తనతో ఒక సారి కూడా చర్చించలేదని సీనియర్‌ సభ్యుడిగా, పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న తాను ఈ విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.