విషాదంగా మారిన పాపికొండల యాత్ర

గోదావరిలో గల్లంతయిన ప్రకాశ్‌ కోసం ఎదురుచూపులు

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

భువనగిరి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి పూస ప్రకాష్‌ పాపికొండల్లో గల్లంతైన ఘటనలో 48 గంటలు గడిచినప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని పీసీఎల్‌ సాప్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే ప్రకాష్‌ మరో ఆరుగురు స్నేహితులతో కలిసి శుక్రవారం ఉదయం భద్రాచలం వెళ్లారు. అదేరోజు సాయంత్రం పడవలో పాపికొండలకు వెళ్లి మార్గమధ్యలోని పర్యాటక కేంద్రం తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్ర పురంలోని కొల్లూరులో రాత్రి బస చేశారు. శనివారం ఉదయం సవిూపంలోని గోదావరి నదిలో ప్రకాష్‌తో పాటు మరో ఇద్దరు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. కానీ నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ముగ్గురు కొట్టుకపోతుండగా స్థానిక కొండారెడ్లు, జాలర్లు ఇంజన్‌ బోట్‌తో వేగంగా వెంటాడి భాస్కర్‌, మహేష్‌లను అతికష్టం విూద కాపాడారు. కాని ప్రకాష్‌ మాత్రం గల్లంతయ్యాడు. మియాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటనలో నదిలో గల్లంతైన ప్రకాష్‌ ఆచూకీని కనుక్కునేందుకు అక్కడి ఎస్‌ఐ రామకృష్ణతో పాటు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు, జాలర్లు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నదీ ప్రవాహంలో కొట్టుకపోయి ఇప్పటికి 48 గంటలు గడుస్తుండటంతో అతడు బతికి ఉండే అవకాశాలు

తక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ప్రకాష్‌ గల్లంతైన ప్రదేశం నుంచి సుమారు 100 కిలోవిూటర్ల దూరంలో గల ధవళేశ్వరం ప్రాజెక్ట్‌ వద్దే అతని ఆచూకీ లేదా అతని మృతదేహం లభ్యమయ్యే అవకాశం ఉంటుందని అక్కడి మత్య్సకార్మికులు పేర్కొంటున్నారు. సహచర మిత్రులు ప్రకాష్‌ నదీ ప్రవాహంలో కొట్టుకపోవడం మరో ఇద్దరు అదృష్టవశాత్తు బతికి బయటపడటంతో మిగతా నలుగురు సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ప్రకాష్‌ గల్లంతైన తెలుసుకున్న అతని సోదరుడు చందు సంఘటనా స్థలానికి వెళ్లాడు. ప్రకాష్‌ ఆచూకీ లభించకపోవడంతో భువనగిరిలోని ఆతని ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్‌బీఐ ఉద్యోగి అయిన పూస నర్సింహ, పద్మ దంపతులు తమకొడుకు ఆచూకీపై ఆందోళనకు గురవుతున్నారు. గల్లంతైన కొడుకు క్షేమంగానే ఉన్నాడని, ఒకటి రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తాడని అతని తల్లి పద్మకు కుటుంబ సభ్యులు ధైర్యవచనాలు చెబుతుండడం అందరిని కంట తడి పెట్టిస్తున్నది. అనారోగ్యంతో ఉండే తల్లికి కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశాలు లేవని చెప్పడానికి బంధువులు జంకుతున్నారు. అలాగే ఏడాది క్రితమే అతని వివాహం కాగా భార్య కూడా సాప్ట్‌వేర్‌ ఉద్యోగే. కొడుకు ఆచూకీ కోసం 48 గంటలుగా తల్లడిల్లుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చడం అందరికి అతికష్టంగా మారింది. పట్టణంలో పలువురు వారి ఇంటికి వచ్చి ఓదారుస్తున్నారు.

పాపికొండలు పర్యాటకం ఒక్క రోజు బంద్‌

పాపికొండలు పర్యాటక లాంచీలను నిర్వాహక సంఘం ఆదివారం నిలిపివేసి గాలింపు చేపట్టారు. గోదావరి శనివారం వ్యక్తి గల్లంతు కావడంతో అతడి ఆచూకీ కోసం నిర్వహించే గాలింపు చర్యలకు సహకరించాలని స్వచ్ఛందంగా ఒక్కరోజు బంద్‌ చేశారు. రాత్రిబస పర్యాటకుడు కొల్లూరు లాంచీల రేవులో గల్లంతు కావడం, పాపికొండలు పర్యాటకులకు అక్కడే భోజనాలు చేయాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం తెలియని కొందరు పర్యాటకులు పోచవరం లాంచీల రేవు వరకు వచ్చి నిరాశతో వెనుతిరిగారు.