విషాదంలో ఉలిందకొండ
కర్నూలు, జూలై 27 : మాజీ మంత్రి, టీడీపీ నాయకులు బీవీ మోహన్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామం ఉలిందకొండ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 1982లో టీడీపీ అధినేత ఎన్టీ రామారావు ఆశీస్సులతో ఆ పార్టీలో చేరారు. ఆనాటి నుంచి అదే పార్టీలో కొనసాగుతూ ప్రజలకు ఎన్నో సేవలందించారు. ఉలిందకొండను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడంలో మోహన్‌రెడ్డి పాత్ర ఎంతో ఉంది. గ్రామానికి రైలు సౌకర్యం, బస్సు సౌకర్యం, ఆసుపత్రులు, పోస్టాఫీసు, రెండు బ్యాంకులు, కో ఆపరేటివ్ సొసైటీ, పశు వైద్యశాల ప్రజోపయోగాల సౌకర్యాలను కల్పించిన ఘనత ఆయనదే. ఉలిందకొండ గ్రామంలో జనాభా అతి తక్కువ. మోహన్‌రెడ్డి తల్లి రెండు దశాబ్దాలుగా సర్పంచ్‌గా పనిచేస్తూ నాలుగు సంవత్సరాల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయ ఆరంగేట్రం ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రి పదవులు చేపట్టారు. అలాగే రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక.. జ్యోతిష్యుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. స్వయంగా ఎన్టీఆర్‌కు జ్యోతిష్యం చెప్పి ఆనాటి నుంచి రాష్ట్ర రాజకీయ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చారు.