విషాహారం తిని అన్నాచెల్లెలు దుర్మరణం
దేవరకోట: విషాహారం తిని అన్నాచెల్లెలు మృతి చెందిన దుర్ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోటలో విషాదం నింపింది. దేవరకోటకు చెందిన వర్రే వీరాస్వామి-స్వాతి దంపతుల కుమారుడైన సాయిశ్రీనివాస్(6) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కుమార్తె దీపిక (3)స్థానిక అంగన్‌వాడి కేంద్రంలో విద్యనభ్యసిస్తోంది. సోమవారం సాయంత్రం పాఠశాల వదిలిన సమయంలో సాయిశ్రీనివాస్ అతని మిత్రుడు మద్దాల సాయిప్రదీప్‌లు పాఠశాల సమీపంలోని దుకాణం వద్ద చాక్లెట్లు కొని తిన్నారు. అనంతరం ఎవరింటికి వారు వెళుతున్నారు. మార్గమధ్యంలో సాయిశ్రీనివాస్‌కు గుర్తు తెలియని వ్యక్తి మెత్తని పొడవాటి చాక్లెట్ ఇచ్చి తినమన్నాడు. చాక్లెట్ తింటూ ఇంటికి వెళ్లగా అతని చెల్లి దీపిక తనకూ కొంచెం చాక్లెట్‌ను పెట్టమంది. సాయి శ్రీనివాస్ దీపికకు కొద్దిగా చాక్లెట్ ఇవ్వగా అది తింది. చాక్లెట్ ఎవరిచ్చారని తల్లి ప్రశ్నించగా, దారిలో పెద్దన్నయ్య ఇచ్చాడని చెప్పాడు. అదే సమయంలో దీపిక కోడిగుడ్ల కూరతో బోజనం చేస్తోంది. తల్లి స్వాతి అదే కూరతో ఒక ముద్దను సాయిశ్రీనివాస్‌కు పెట్టింది. మంచంపై కూర్చుని హోంవర్కు చేసుకుంటున్న సాయిశ్రీనివాస్ నిద్రస్తోందని పడుకున్నాడు. కొద్దిసేపటికే అతని నోటి నుంచి నురుగు రావడంతో కంగారుగా తల్లి, బందువులు చల్లపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సాయిశ్రీనివాస్ మృతి చెందాడని డాక్టర్ ధ్రృవీకరించారు. సోమవారం రాత్రి సాయిశ్రీనివాస్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఇంతలో కుమార్తె దీపిక వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన తల్లి దండ్రులు, బందువులు చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీపిక పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున దీపిక మృతి చెందింది. డీఎస్పీ చాముండేశ్వరి, సీఐ కె.బాలరాజు, ఎస్సై ఎల్. వెంకటేశ్వరరావులు సంఘటనా స్థలాన్ని సందర్శించి తల్లిదండ్రులు, బందువుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. దేవరకోటలో దుకాణం వద్ద అమ్మిన చాక్లెట్‌ల బాక్సును, స్వాతి ఇంటి వద్ద ఉన్న అన్నం, కోడిగుడ్డు కూరను స్వాధీనం చేసుకొని పరీక్షలకు పంపుతున్నామని తెలిపారు.