విహెచ్‌పి, భజరంగ్‌ దళ్‌లపై వివాదాస్పద నివేదిక

అమెరికను ఏజెన్సీ తీరుపై మండిపడ్డ హిందూసంస్థలు

న్యూఢిల్లీ,జూన్‌15(జ‌నం సాక్షి): యుఎస్‌ కు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సిఐఎ) ఓ వివాదాస్పద నివేదికను విడుదల చేసింది. భారత్‌ కు సంబంధించిన విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ సంస్థలు మతపరమైన తీవ్రవాద సంస్థలని సిఐఎ పేర్కొంది. వరల్డ్‌ ఫ్యాక్ట్‌ బుక్‌ అనే పేరుతో సిఐఎ ఓ పుస్తకాన్ని రిలీజ్‌ చేసింది. కాగా తాజా ప్రచురణలో సిఐఎ ఈ వ్యాఖ్యలను చేసింది. దీంతో విహెచ్‌ పి, భజరంగ్‌ దళ్‌ గ్రూపులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. విహెచ్‌ పి, భజరంగ్‌ దళ్‌ లు రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకోస్తున్నాయంటూ, అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. విహెచ్‌ పి, భజరంగ్‌ దళ్‌ లు రాజకీయాల్లో తల దూర్చుతున్నాయని, అవి రాజకీయ నాయకులను ఆకర్షిస్తున్నాయని తెలిపింది. కానీ ఆ సంస్థలకు పనిచేసే వారు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయరు అని సిఐఎ తన పుస్తకంలో రాసింది. సిఐఎ ఇచ్చిన నివేదికను విహెచ్‌ పి తప్పుపట్టింది. సిఐఎ విడుదల చేసిన రిపోర్టుపై జోక్యం చేసుకొని మాట్లాడాలని భారత్‌ ప్రభుత్వాన్ని కోరామని విహెచ్‌ పి ప్రతినిధి వినోద్‌ బన్సాల్‌ చెప్పారు. మిలిటెంట్‌ సంస్థలంటూ కామెంట్స్‌ చేసిన సిఐఎ క్షమాపణలు చెప్పాలని విహెచ్‌ పి డిమాంట్‌ చేసింది. భారత్‌ లోరాజకీయంగా ప్రభావం చూపిస్తున్న సంస్థల్లో రాష్టీ స్వయం సేవక్‌ సంఘ్‌ తో సహా హురియత్‌ కాన్ఫరెన్స్‌, జమాద్‌ ఉలేమా హింద్‌ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ భాగం కలిగిన సంస్థ అని, హురియత్‌ మాత్రం వేర్పాటువాద సంస్థని సిఐఎ స్పష్టం చేసింది. పొలిటికల్‌ ప్రెజర్‌ గ్రూప్స్‌ క్యాటగిరీలో సిఐఎ ఈ సంస్థలను చేర్చడం గమనార్హం.