వీరప్పన్‌ అనుచరుల ఉరి అమలుపై తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ : గంధవు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అనుచరుల ఉరి అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. వీరప్పన్‌ అనుచరులైన నలుగురి ఉరి అమలుపై బుధవారం వరకు స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునిచింది. తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకూ స్టే అమలులో ఉంటుందని తెలిపింది. నలుగురు దోషులు పెట్టుకున్న పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.
వీరప్పన్‌ అనుచరుల జ్ఞానప్రకాశ్‌, సైమన్‌, బీసేకర్‌ మాదయ్య, బిలవెంద్రన్‌లు కార్ణటకంలోని పలార్‌ వద్ద ల్యాండ్‌మైన్‌ పేల్చి 22 మంది పోలీసులను బలిగోన్న ఘటనలో ఉరిశిక్షను ఎదుర్కోంటున్నారు. మొదట ఈ ఘటనలో మైసూర్‌ కోర్టు దోషులకు జీవిత ఖైదు విధించింది. అనంతరం సుప్రీంకోర్టు వీరి జీవిత ఖైదును ఉరిశిక్షగా మార్చింది. వీరి క్షమాభిక్ష పిటిషన్‌ను గత బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో శనివారం పిటిషన్‌దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని సుప్రీం తేల్చిచెప్పడంతో నేడు మరోసారి న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు తొమ్మిదేళ్ల కాలం పట్టిన కారణంగా ఈ ఘటనలో నలుగురి ఉరిశిక్షను జీవితఖైదుగా తగ్గించాలని వారి తరపు న్యాయవాదులు కోరుతున్నారు.