వృద్ధ దంపతులపై దాడి
మెదక్ : వృద్ధ దంపతులపై దొంగలు దాడిచేసి బంగారం అపహరించిన విషయం బుధవారం వెలుగుజూసింది. మెదక్ జిల్లా కొండపాక మండలం బండారం శివారులో వృద్ధ దంపతులు ఉండడాన్ని గమనించిన దొంగలు వారిపై దాడికి పాల్పడి వారి వంటిపై ఉన్న మూడు తులాల బంగారాన్ని దోచుకున్నారు. కాగా… జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చోరీలు అధికమయ్యాయి. పటాన్‌చెరు, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నప్పటికీ పోలీసులు గస్తీ పెంచకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా అటు కర్ణాటక, మహరాష్ట్ర సరిహద్దుల్లో ఉండడమేగాక ముంబాయి జాతీయ రహదారిపై ఉండడం వల్ల జిల్లాలోకి దొంగల ముఠాలు సులువుగా వచ్చే వీలుంది. ఇప్పటికే ఈ ముఠాలు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో భారీ చోరీలకు పాల్పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కొండపాక మండలంలో పట్టపగలే దంపతులపై దాడి చేసి బంగారం చోరీ చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు గస్తీని మరింత పెంచాలని పలువురు కోరుతున్నారు.