వెక్కిరిస్తున్న మంచినీటి పథకాలు
నల్లగొండ,మే7(జనంసాక్షి): కృష్ణానది చెంతనే ఉన్నా వేసవికాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు దాహం తీర్చుకునేందుకు చేద బావులు, చేతిపంపులు, వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా నేటి వరకు మండలానికి నీరందే పరిస్థితి లేదు. దీంతో ప్రజలు మంచినీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. చందంపేట మండలానికి పక్కనే కృష్ణా పరవళ్లు తొక్కుతున్నా కొన్ని గ్రామాలకు మాత్రం కృష్ణాజలాలు మాత్రం అండం లేదు. గ్రామాలకు కృష్ణాజలాలు అందించేందుకు రూ.50 కోట్ల వ్యయంతో పెండ్లిపాకుల ప్రాజెక్టు నిర్మాణ పనులు తలపెట్టారు. పెండ్లిపాకుల ప్రాజెక్టు నుంచి చందంపేటలోని పలు గ్రామాలకు పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో రోజురోజుకు జాప్యం ఏర్పడడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. చౌటుప్పల్ మండల ప్రజలకు కృష్ణా తాగు నీటిని అందించేందుకు చేపట్టిన పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గ్రామాలకు కృష్ణా నీటిని సరఫరా చేయడానికి గుత్తేదారుతో ఒప్పందం జరిగింది. ఏడాది గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. అవి పూర్తయితే గానీ గ్రామాలకు నీళ్లు వచ్చే అవకాశం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఈ పథకానికి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, బొమ్మల రామారం, బీబీనగర్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, తుర్కపల్లి మండలాల్లోని గ్రామాలకు కృష్ణా తాగునీటిని పైపులైన్ల ద్వారా అందించేందుకు నిర్ణయించారు.