వెళ్లిపోడానికి సంకోచించకండి!


లాలూ పార్టీకి కాంగ్రెస్‌ హితవు
పట్నా: ఆర్జేడీ.. జేడీయూ పార్టీలు.. బిహార్‌ రాజకీయ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్న పార్టీలు. దశాబ్దాల పాటు బద్ధశత్రువులుగా ఉన్న ఈ రెండు పార్టీలు అధికారం కోసం ఇటీవల చేతులు కలిపాయి. 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి మహాకూటమిగా ఏర్పడి జయకేతనం ఎగురవేశాయి. అయితే తాజాగా ఆ కూటమిలో అంతర్యుద్ధం మొదలైనట్లు వూహాగానాలు వెలువడుతున్నాయి. నితీశ్‌ పార్టీపై ఆర్జేడీకి చెందిన కొందరు నేతలు విమర్శలు చేశారు. దీంతో కూటమిలోని మరో పార్టీ అయిన కాంగ్రెస్‌ జేడీయూకు మద్దతుగా నిలిచి.. ఆర్జేడీ తీరును వ్యతిరేకించింది. అసలేం జరిగిందంటే..

ఎన్నికల అనంతరం మహాకూటమి నుంచి జేడీయూ అధినేత నితీశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల్లో ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినా.. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ కలగజేసుకోవడంతో కూటమికి నాయకత్వం వహించిన నితీశ్‌నే సీఎంగా ఎన్నుకోవాల్సివచ్చింది. అయితే ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆర్జేడీ నేత, మాజీ ఎంపీ షహబుద్దీన్‌.. సీఎం నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల కారణంగా మాత్రమే నితీశ్‌ను సీఎంను చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ మరో సీనియర్‌ నేత రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ కూడా నితీశ్‌పై విమర్శలు చేశారు.

దీంతో ఆర్జేడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.‘నితీశ్‌ నాయకత్వం ఇష్టంలేకపోతే.. ప్రభుత్వం నుంచి విడిపోడానికి ఏ మాత్రం సంకోచించకండి’ అని ఆర్జేడీని ఉద్దేశించి బిహార్‌ విద్యాశాఖమంత్రి, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ చౌదరి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ మాత్రం.. ప్రభుత్వంతో తమకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పుకొస్తున్నారు. తమ పార్టీ నేతలు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో తనకు అర్థం కావడం లేదని, దీనిపై తమ నేతలతో మాట్లాడతానని చెప్పారు. మీడియా తమ మధ్య అభిప్రాయభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.