వేతనాలందక అల్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కార్మికులు
హైదరాబాద్ : ప్రతి నెలా 1వ తేదీన టంచనుగా జీతాలు తీసుకుంటున్న జీహెచ్‌ఎంసీ అధికారులు…. పారిశుధ్య కార్మికులకు వేతనాల చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సకాలంలో పైసలు అందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొటున్నాయి.జీహెచ్‌ఎంపీలో పారిశుధ్య కార్మికులకు జీతాల చెల్లింపు అంశం అస్తవ్యస్తంగా మారింది. భారీ మొత్తంలో జీతాలు తీసుకునే అధికారులు, సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీనే బ్యాంకు అకౌంట్లలో జమ అవుతాయి. కానీ పారిశుధ్య కార్మికులు మాత్రం వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వచ్చే వేతనం తక్కువ ఆపై సుదీర్ఘ జాప్యంతో కార్మిక కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో చితికిపోతున్నాయి.గతంలో ప్రతి నెలా 3 వ తేదీలోగా వేతనాలు అందేవి. కానీ ఇప్పుడాపరిస్థితిలేదు. ప్రతి నెలా 20 వ తేదీ తర్వాతే ఇస్తున్నారు. దీంతో ఆర్ధిక సమస్యలతో బతుకీడ్చాల్సి వస్తోందిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకేకాదు… పర్యవేక్షకులకు కూడా సకాలంలో వేతనాలు అందడంలేదు. కొన్ని డివిజన్లలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు, పర్యవేక్షకులు సకాలంలోనే వేతనాలు అందుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పనిచేసే వారికి మాత్రం జాప్యం చేస్తున్నారు. తమ పట్ల ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు.