వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు
28 నుంచి 2 వతేదీ వరకు జాతర
భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
వేములవాడ,ఫిబ్రవరి25(జనం సాక్షి): దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మేరకు ఆలయ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు సంబంధించిన పనులు 80 శాతం పూర్తయ్యాయని, మరో రెండు రోజుల్లో పనులన్నీ పూర్తి చేస్తామని ఆలయ ఈవో ఎల్.రమాదేవి తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన వేములవాడ పుణ్యక్షేత్రంలో అత్యంత ప్రధానమైన పండుగగా భావించే మహాశివరాత్రి ఉత్సవాల మూడు రోజుల జాతరకు సుమారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర ఏర్పాట్లలో భాగంగా 38 లక్షల రూపాయలతో చలువ పందిళ్లు ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తి కాగా, పందిళ్ల డెకొరేషన్ పనులు తుది దశకు చేరాయి. 32 లక్షల రూపాయలతో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. జాతర సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో శివార్చన పేరిట సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు 24 లక్షల రూపాయల అంచనా వ్యయంతో గుడి చెరువు స్థలంలో వేదిక, బారికేడిరగ్, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కళాకారులకు పారితోషికం కోసం మరో 25 లక్షలు వెచ్చించారు. 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ
ఆలయాలకు రంగులు వేస్తున్నారు. 10లక్షల అంచనా వ్యయంతో నటరాజ్ విగ్రహం నుండి జనరేటర్ షెడ్డు వరకు గల వీఐపీ రోడ్డును తారు రోడ్డుగా మార్చారు. 5 లక్షల రూపాయలతో ప్లెక్సి బ్యానర్లు, 4.50 లక్షలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 4 లక్షలతో మూలవాగులో రోడ్డు నిర్మిస్తున్నారు. 3 లక్షలతో పార్కింగ్ స్థలాలలో బారికేడ్ ?స ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు క్యూలైన్లలో అందించడానికి వీలుగా 1.50 లక్షలతో మంచినీళ్ల ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నారు.