వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదం
భారీగా ఆస్తి నష్టం
హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) : నాచారంలోని ఒక టింబర్‌డిపోలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు లేవడంతో పనిచేసే కార్మికులు వెలుపలకు పరుగులు పెట్టారు. మరికొందరు అగ్నిమాపక కేంద్రం అధికారులకు సమాచారం అందించారు. వారు మంటలను అదుపు చేశారు. భారీగా ఆస్తినష్టం సంభవించినట్టు తెలిసింది. ఎటువంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని అగ్నిమాపక కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా వనస్థలిపురంలోని ఎస్‌బిఐ బ్యాంకు కార్యాలయంలో శనివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎసిలో షార్ట్‌సర్క్యూట్ తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఖాతాదారులకు సంబంధించిన రికార్డులు భద్రంగానే ఉన్నాయని, ఆందోళన పడొద్దని ఖాతాదారులకు బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఎసి, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసమైందని చెప్పారు. ఖాతాదారులకు ఆటంకం కలగకుండా సమీపంలోని బ్యాంకు శాఖల నుంచి సేవలు పొందాలని సూచించామన్నారు. హయత్‌నగర్,హస్తినాపురం,ఎల్బీనగర్ ఎస్‌బిఐ బ్యాంకు శాఖల్లో సేవలను అందించేం దుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. పరిస్థితిని అర్ధం చేసుకుని సహకరించాలని ఖాతాదారులను కోరారు.