వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి

పలుగొర్రెలు మృతి: కాపరులకు భారీగా నష్టం
మహబూబ్‌నగర్‌,మే2( జ‌నం సాక్షి): వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి చేయడంతో అనేక గొర్రెలు మృతి చెందాయి. నష్టం లక్షల్లో ఉంటుందని అంచనా. చిరుతపులి దాడిలో గొర్రెలు మృతి చెందిన సంఘటన గండీడ్‌ మండల పరిధిలోని వెంకట్‌రెడ్డిపల్లి సవిూపంలో జరిగింది. వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన కురువ నాగయ్యకు గతంలో ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేసింది. వాటిని తన వ్యవసాయ పొలానికి నిత్యం మేతకు తీసుకెళ్లి వచ్చేవాడు. సోమవారం రాత్రి మందలోంచి నాలుగు గొర్రెలను చిరుతపులి దాడి చేసి అడవిలోకి తీసుకెళ్లింది. ఎప్పటి లాగే నాగయ్య గొర్రెల దగ్గరకు వెళ్లి చూడగా అందులో నాలుగు గొర్రెలు కనిపించ లేదు. అడవిలో వెతకగా గొర్రెలను చిరుత పులి దాడి చేసి చంపేసిన ఆనవాళ్లు కని పించాయి. సంబంధిత అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం అటవీ ప్రాంతంలో చిరుత పులి కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతంలో ధర్నామోని నర్సింహ అనే రైతుకు చెందిన రెండు గొర్రెలపై దాడి చేసి చంపేసింది. దీంతో గొర్రెల కాపరులు, గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. జనగామ జిల్లాలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన జిల్లాలోని యెల్లముల గ్రామంలో చోటు చేసుకున్నది. అదే గ్రామానికి చెందిన చంద్రయ్యకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. దీంతో 15 గొర్రెలు మృతి చెందాయి. వీటి మొత్తం విలువను లెక్కిస్తున్నారు.