వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం

మెదక్‌/మహబూబ్‌నగర్‌,మార్చి9 : తెలంగాణలో మరోమారు రోడ్లు నెత్తురోడాయి.  మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో కనీసం  ఆరుగురు దుర్మరణం చెందారు. హైరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం రంగారెడ్డిగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై కర్నూలు వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రంగారెడ్డిగూడ సువర్ణ అపియరల్స్‌ కంపెనీ వద్ద రోడ్డు పక్కనున్ను భారీ కేడ్లను ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం మృతదేహాలను షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ప్రకాశ్‌, రాజులుగా గుర్తించారు. మెదక్‌  జిల్లా గజ్వేల్‌ ఆగి ఉన్న లారీనీ కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆరుగురు గల్ఫ్‌దేశాలకు వెళుతున్న తమ బంధువులకు వీడ్కోలు చెప్పడానికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు రాజనర్సు, నవీన్‌, నరేష్‌లుగా గుర్తించారు. క్షతగాత్రులను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఇక కొండపాక మండలం కొమరవెల్లి గేటు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని వరంగల్‌ జిల్లా చేరియాల మండలం రాంసాగర్‌కు చెందిన బండి కృష్ణయ్య (40) అక్కడికక్కడే మృతి చెందాడు. కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తుచేస్తున్నారు. మృతుడు బండి కృష్ణయ్య హైదరాబాదులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడు బస్సు దిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.