వేసిన సూటు మళ్లీ వేయని మోదీ..


` కాంగ్రెస్‌ కులగణన హామీతో ప్రధాని గుండెల్లోగుబులు
భోపాల్‌(జనంసాక్షి): ఓబీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనను దేశ ప్రజలు ప్రధానిని చేశారని చెప్పుకొనే మోదీ ఆ సంగతిని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ప్రధానిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని పదేపదే చెబుతుండటంతోనే.. మోదీ తన ప్రసంగాల్లో కుల ప్రస్తావన తీసుకు రావడం లేదని, దేశంలో కులమే లేదని చెప్పడం మొదలు పెట్టారని రాహుల్‌ విమర్శించారు. దేశ ప్రజల జీవితాలను మార్చేందుకు కులగణన చాలా కీలకమన్న ఆయన.. దీనిని ఓ విప్లవాత్మక ముందడుగుగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. కేవలం మధ్యప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్‌ పునరుద్ఘాటించారు.మోదీ ధరిస్తున్న ఒక్కో సూటు రూ. లక్షల విలువ చేస్తుందని రాహుల్‌ అన్నారు. అలాంటిది.. ఒకసారి వేసుకున్న సూటు ఆయన మళ్లీ ధరించడం ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. తాను మాత్రం ఓ తెల్లరంగు చొక్కా, లేదంటే టీ షర్టు ధరిస్తానని చెప్పుకొచ్చారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే ఓబీసీలు ఎంతమంది ఉన్నారో కచ్చితంగా తెలుసుకోవడానికి కులగణన చేపడతామని అన్నారు. రాష్ట్రంలో పథకాలను అమలు చేసేందుకు, అర్హులను గుర్తించేందుకు కులగణన ఓ ఎక్స్‌`రే లా ఉపయోగపడుతుందని తెలిపారు. తాను జోడో యాత్ర కొనసాగిస్తున్న సమయంలో వేల మంది యువతను కలిశానని, డిగ్రీలు పూర్తయినా ఉద్యోగం దొరక్క  తీవ్ర నిరాశలో ఉన్నారని రాహుల్‌ గుర్తు చేశారు. దేశాన్ని బలోపేతం చేయగల సత్తా, అంతటి పని తనం యువతలో ఉన్నప్పటికీ.. ఉద్యోగ కల్పనలో కేంద్రం విఫలమైందని రాహుల్‌ మండిపడ్డారు.