వైద్యరంగంలో విప్లవం

– తొలి డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌

సిద్ధిపేట, గష్టు 18(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో తొలి డయాలసిస్‌ కేంద్రాన్ని సిద్ధిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రులు డాక్టర్‌ లక్ష్మారెడ్డి,హరీశ్‌ రావు శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతర్వాత విద్య,వైద్య రంగాల్లో విప్లవం వచ్చిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. విద్య,వైద్య రంగాల్లో గొప్ప మార్పు వచిందన్నారు.గతంలో సర్కార్‌ నుండి ప్రైవేట్‌ కు పోయేవారని రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రైవేట్‌ నుండి సర్కారుకు వస్తున్నారని తెలిపారు.ఇదొక సంచలన మార్పు అన్నారు. పాఠశాలలు,కళాశాలల్లో కూడా ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని మంత్రి చెప్పారు.పేద కిడ్నీ రోగుల బాధను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో 40 డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని హరీష్‌ తెలిపారు.అందులో మొట్ట మొదటి డయాలసిస్‌ కేంద్రం సిద్దిపేటలో ఈ రోజు ప్రారంభిస్తున్నామని చెప్పారు. నెల రోజుల్లో మిగతా 39 డయాలసిస్‌ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని చెప్పారు. సిద్దిపేటలో 5 బెడ్స్‌ ఏర్పాటు చేశామని,ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు పనిచేస్తుందని హరీష్‌ తెలిపారు.ప్రతి రోజు 20 మంది రోగులకు డయాలసిస్‌ చేసే అవకాశం ఉందన్నారు.జపాన్‌ నుండి దిగుమతి చేసుకున్న మిషన్‌,జర్మని నుండి తెప్పించిన వాటర్‌ ఫిల్టర్లతో ఒకరికి వాడినవి ఇంకొకరికి వాడకుండా డయాలసిస్‌ చికిత్స చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.ఆర్థిక భారం పడకుండా రోగులకు బస్సు పాస్‌ సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు.పేదల గురించి ప్రభుత్వం నిరంతరం ఆలోచనలు చేస్తున్నదని హరీష్‌ రావు చెప్పారు.సిద్దిపేటలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్‌ పూర్తయి నో అడ్మిషన్‌ బోర్డు పెట్టారని గుర్తు చేశారు. సిద్దిపేట ఆసుపత్రిలో న్యూ బార్న్‌ బేబీ కేర్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. 30 బెడ్స్‌ ఏర్పాటు చేయగా ప్రతి రోజు 15 మంది ప్రైవేటు హాస్పిటల్స్‌ నుండి చికిత్సకు వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు,డాక్టర్లు,శిక్షణ పొందిన సిబ్బంది సిద్ధిపేట ఆసుపత్రిలో వున్నారని తెలిపారు.ప్రజల్లో నమ్మకం పెరిగి ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని అన్నారు.ఒక్క జులై నెలలో 503 ప్రసవాలు జిల్లా ఆసుపత్రిలో జరిగాయని ఇదొక రికార్డు అని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.విధి నిర్వహణ లో ప్రతిభను చూపే ప్రభుత్వ డాక్టర్లను సన్మానించామని ఆయన గుర్తు చేశారు.