వైవాహిక బంధం చెడినా.. విడాకులు ఇవ్వకపోవడం క్రూరత్వమే

` కేరళ హైకోర్టు
కొచ్చి(జనంసాక్షి): దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్‌ ఏ మహమ్మద్‌ ముస్తాక్‌, జస్టిస్‌ సోఫీ థామస్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ తరుచూ గొడవపడడం, ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చుకోకపోవడం, వెలివేసుకోవడం లాంటి ఘటనల వల్ల ఆ జంట కలిసి ఉండలేదని, అలాంటప్పుడు ఆ దంపతులు విడాకులు తీసుకోవాలని, ఒకవేళ ఒకరు దరఖాస్తు చేసుకున్నా, భాగస్వామి ఆ విడాకుల్ని అడ్డుకోవడం క్రూరమైన చర్యే అవుతుందని హైకోర్టు తెలిపింది.త్రిసూరుకు చెందిన స్థానికుడు వేసిన కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2002లో పెళ్లి చేసుకున్న వ్యక్తి.. తనకు భార్య నుంచి విడాకులు ఇప్పించాలని గతంలో కోర్టును ఆశ్రయించారు. తన భార్య కేవలం డబ్బును మాత్రమే కోరుకుంటోందని, ఆమెకు మరో అఫైర్‌ ఉందని, ఇంటి నిర్మాణం కోసం విదేశాల నుంచి పంపిన డబ్బును ఆమె వృధా చేసినట్లు ఆ వ్యక్తి తన ఫిర్యాదులో ఆరోపించాడు. 2011లో పిటీషనర్‌ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు అతను 60 ఏళ్లు దాటాడు.ఈ కేసులో ఇద్దరూ కోర్టు చుట్టు తిరగడం దశాబ్ధం దాటినట్లు ధర్మాసనం తెలిపింది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా.. వారి మధ్య సరైన జీవనయానం లేదని కోర్టు చెప్పింది. ఈ కేసులో పిటీషనర్‌కు విడాకులు మంజూరీ చేస్తూ తీర్పును ఇచ్చింది. భార్యకు పది లక్షలతో పాటు 10 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.