వైవిద్య పరిరక్షణకు రాష్ట్ర తోడ్పాటు అందిస్తుంది : సీఎం
హైదరాబాద్ , అక్టోబర్ 15 (జనంసాక్షి) : జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నిర్ధేశించుకున్న జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలను సాధించేందుకు వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు సైతం క్రియాశీల చర్యలతో సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సెటీఫ్ ఫర్ సిటీ’ పేరిట సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మరొక ప్రపంచస్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు. జీవవైవిధ్య సదస్సులో భాగంగా నిర్దేశించుకున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాల సాధన కోసం జాతీయ, స్థానిక ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పక సహకరిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మంచి ఫలితాలను అందించే ప్రాజెక్టులు, కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసుకోవడానికి అవసరమైన వనరుల కేటాయింపు అంశం ఇందులో ఇమిడి ఉన్నందున ఆయా ప్రభుత్వాలకు అవసరమైన వనరుల సేకరణ, తదుపరి అంశం దిశగా భాగస్వామ్య పక్షాలను ప్రోత్సహించేలా సరస్సు ఫలితాలు ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో జీవవైవిధ్య పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు గాను ఒక జీవవైవిధ్య మ్యూజియం, జీవ వైవిధ్య వనం, కాస్-11 స్మారక పైలాన్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం నడుం బిగించిందని కిరణ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 590 బయోడైవర్శిటీ మేనేజ్‌మెంట్ కమిటీలను నెలకొల్పిందని, హైదరాబాద్ నగర బయోడైవర్శిటీ మేనేజిమెంట్ కమిటీ అందులో ఒకటని తెలిపారు. తిరుమల కొండలతోపాటు నాలుగు ప్రాంతాలను జీవ వైవిధ్య ప్రదేశాలుగా రాష్ట్ర బయోడైవర్శిటీ బోర్డు గుర్తించిందన్నారు. జీవసంబంధ వనరుల వినియోగానికి సంబంధించిన అనుమతుల కేటాయింపునకు కూడా రాష్ట్ర బయోడైవర్శిటీ బోర్డు చొరవ తీసుకుంటుందని, ఇటీవల జపాన్‌లో వేపనీటి ఉత్పత్తి కోసం ఒక జపాన్ సంస్థకు వేపాకుల సరఫరా కోసం రెండు గ్రామాల్లోని స్థానిక వర్గాల మధ్య బయోడైవర్శిటీ మేనేజ్‌మెంట్ కమిటీలు ఒప్పందం కుదిర్చాయని ముఖ్యమంత్రి వివరించారు. జాతీయ, స్థానిక ప్రభుత్వాల మధ్య సమన్వయం నెరపడం తమ బాధ్యత అన్నారు.