వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యం

పారిశుద్ద్యం విషయంలో ప్రజలు చైతన్యం కావాలి

భద్రాద్రికొత్తగూడెం,జూలై30(జ‌నం సాక్షి): బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంత్‌ కోరారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. వీటితోపాటు ఇళ్లలో నుంచి వెలువడే మురుగు నీరు వీధుల వెంట ప్రవహించకుండా ఎక్కడికక్కడే ఇంకిపోయేలా ఇంకుడుగుంతలు తవ్వుకోవాలని కోరారు. పశువుల పేడ, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ప్రభుత్వం మంజూరు చేస్తున్న కంపోస్టు పిట్స్‌లో వేసుకొని సేంద్రియ ఎరువును తయారు చేసుకోవాలని సూచించారు. ఈ మూడు పథకాలలో ప్రభుత్వం నుంచే నిధులు మంజూరు చేస్తున్నందున ఎవరికీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. రోగాలు లేని జీవితం కోసం ఈ మూడు నిర్మాణాలను ప్రతి ఇంట్లో తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించాలని సూచించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, పంచాయతీ కార్యాలయాలకు, ట్యాంకులకు రంగులు వేయాలని సూచించారు. డ్రైనేజీలను శుభ్రపరచాలని, మురుగు నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.