వ్యక్తిగత విమర్శలను ఇక మానండి

ఇంట్లో వాళ్లను రచ్చకీడ్వకండి

ట్విట్టర్‌లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చయడంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ తనను ఈ విధంగా విమర్శించడం ఎందరినో బాధించిందని అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేశారు. ‘ఈ మధ్య జగన్‌ గారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లను. అందులోనూ రాజకీయ లబ్ది కోసం ఇలాంటి పనులు అస్సలు చేయను. ప్రజలకి సంబంధించిన పబ్లిక్‌ పాలసీల విూదే ఇతర పార్టీలతో విభేదిస్తాను కానీ నాకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ నేపథ్యంలో ఎవరన్నా జగన్‌ను కానీ ఆయనకు సంబంధించిన కుటుం సభ్యులను, ఆయన ఇంటి ఆడపడుచులని ఈ వివాదంలోకి లాగవద్దని అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి ఈ వివాదాన్ని అందరూ ఇక్కడితో ఆపేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు పవన్‌.వైసిపి అధ్యక్షుడు జగన్‌ ఇటీవల పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్‌ అభిమానులు జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ విూడియా వేదికగా జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకి పవన్‌ తన విన్నపాన్ని ట్వీట్‌ ద్వారా తెలిపారు. జగన్‌ ఆరోపించిన తీరు చాలా మందికి బాధ కలిగించినట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తను ఎవరి వ్యక్తిగత జీవితాలలోకి వెళ్లనన్నారు. అంతేకాకుండా అది రాజకీయ లబ్ది కోసం అసలు వాడనని పవన్‌ పేర్కొన్నారు.భీమవరంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జగన్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. ఫ్యాక్షనిస్టులు ఇష్టానుసారంగా మాట్లాడితే సైనికుడు ఉప్పెనలా పోరాడుతాడని పవన్‌ స్పష్టం చేశారు.