వ్యక్తిత్వం చిత్తశుద్ధి- సామాజిక బాధ్యత!

స్వార్ధచింతనే ప్రధాన గుణంగా నడుస్తున్న ఈ రోజుల్లో స్వార్థమే తనకు తాను పెద్దపీట వేసుకొని కూర్చుంది. పూర్వం ఏమాత్రం పరిచయం లేని వాళ్ల పట్ల కూడా మన పెద్దలు నిజాయితీగా వ్యవహరించేవారు. ఆత్మవారికి “ఆత్మ సాక్షిగా” ఉండేది. తప్పు చేస్తే డిలీట్ చేసేది. అసలు తప్పు వైపు ఆలోచించేదే కాదు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. జీవితం ఆత్మ రైతం ఆత్మీయ రహితమా అయిపోయింది!.కాలం అంటే కదలిక ఇది మార్పుగా కర్మఫలంగా ప్రత్యక్షమవుతుంది! వేద సంస్కృతిలో“కర్మ ఫల ప్రదాత” ఒక పని చేశాక అది కాలాంతంలో ఫలంగా కనిపిస్తుంది. ఎప్పుడో వేసిన విత్తనం వృక్షపళంగా లభించినట్లు, నాటి విత్తనాన్ని నేడుపలంగా పరిణవింపజేసిన శక్తి కాలానిదే. కాలంలో “సత్ఫలం” లభించాలంటే కర్మలోను “సత్” ఉండాలి. దీన్నే అందమైన ఉదాహరణకు మహాభారతంలో వ్యాసుడు హృదయంగా వక్కానిస్తాడు!“ఒక విత్తనం వేసి, మరొక పండును ఆశించరాదు. జామ విత్తనం వేసి మామిడి పలాన్ని కోరుకోకూడదు. ఇక్కడ పుణ్య పాపాలంటే మంచి చెడులే మంచి పనికి మంచి ఫలితం ఉంటుంది అనే దృఢవిశ్వాసమే శ్రద్ధ.
పనిచేసే తీరులో గొప్పతనం సరిపోదు. దాని వెనుక ఉన్న సంకల్పం, భావం కూడా పనికి శక్తినిస్తాయి. ధర్మరాజు రాజసూయ యాగం వైభవంగా చేశాడని అసూయతో పోటీగా దుర్యోధనుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. కానీ రాణించలేదు. యాగక్రియ గొప్పగా జరిగిన అందులో సత్తు లక్షణం లేదు. దుర్భావం దానికి పునాది. కనుక కాలం పల రూపంగా వచ్చేటప్పుడు సత్ఫలాన్ని ఇవ్వలేకపోయింది. కర్మ గొప్పదైన సంకల్ప శుద్ధి లేనప్పుడు అది వికటిస్తుందనడానికి ఇదే ఉదాహరణ. ఈరోజు కాల గతిలో కొత్త మలుపు బతుకుల్లో కొత్తదనానికి తీయని పిలుపు మనిషి సృజన పౌరుషానికి ఇది మేలుకొలుపు! కొత్త చిగురు తొడుగుతుంది కాలం అనే చెట్టు. మనిషి సుఖంగా బతకాలంటే ఒకటే సూత్రం- రాత్రి ప్రశాంతంగా నిద్రపోనియని పనులేవి పగలు చేపట్టకూడదు. పగలు తలుచుకునే పనులేవి రాత్రి తలపెట్టకూడదు. అన్నాడొక తత్వవేత్త.
1.జరుగుతున్న ప్రతి కార్యానికి కారణం ఉన్నట్లు తలపెట్టిన ప్రతి పనికి కూడా లక్ష్యం, నిర్ణీత ఆకాంక్షలు, సాధ్యసాద్యాల పైన చర్చ, సమీక్షలు, బావ వినిమయము తప్పనిసరి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది కార్యక్రమం యొక్క అంతరార్థం స్పష్టమవుతుంది . కొన్ని సందర్భాలలో ఏ లక్ష్యము లేకుండా, ఆకాంక్షలు అసలే లేకుండా , ఎందుకు చేస్తున్నామో తెలవకుండానే గుడ్డిగా తలపెట్టే సందర్భాలు కూడా మానవ సమాజంలో కొనసాగుతున్నాయి . అలాంటి సందర్భాలలోనే వ్యక్తిత్వం, చిత్తశుద్ధి , సామాజిక బాధ్యత , సామాజిక మార్పు అనే విషయాలు ప్రస్ఫుటమవుతాయి. గమ్యాన్ని స్పష్టంగా నిర్వచించుకోకుండా, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉద్దేశించిన గమనాన్ని చిత్తశుద్ధితో పాటించకపోతే , అప్పుడప్పుడు గమన దిశ వ్యతిరేక దిశలో గనుక కొనసాగితే , గమ్యాన్ని చేరుకోవడం అటు0చి జీవిత కాలం లోపల కూడా చేరుకోలేనటువంటి గడ్డు పరిస్థితులు ఏర్పడవచ్చు . ఈ విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలంటే ఒక దేశం లేదా రాష్ట్రం సమానత్వాన్ని సాధించడం ద్వారా అసమానతలు, అంతరాలు లేని వ్యవస్థను నిర్మించాలని కోరుకుంటుంది .కానీ ఆ లక్ష్యాన్ని సాధించే క్రమము లోపల ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు లేదా విధానాలు అందుకు భిన్నంగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఎంచుకున్న సుదీర్ఘ లక్ష్యాన్ని చేరుకోలేము. పైగా వ్యతిరేక ఫలితాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అంటే గమ్యం ఎంత గొప్పదో గమనం కూడా చిత్తశుద్ధిగా ఎంచుకున్నప్పుడు మాత్రమే లక్ష్యాలు నెరవేరుతాయి ఆకాంక్షలు కార్యరూపం తాలుస్తాయి అనేది నగ్నసత్యం . ఈ ప్రాపంచి క దృక్పథం , సామాజిక తాత్వికత, గమ్యము గమనాల పట్ల అవగాహన , నైతిక విలువలు , మానవాభివృద్ధి వంటి అనేక అంశాలు కూడా వ్యక్తి నిర్మాణంలోనూ జీవన గమనంలోనూ వ్యక్తిత్వ వికాసం లోను సామూహిక ఆశయాలను నిర్వచించుకోవడంలోనూ ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవడంలోనూ దేశాభివృద్ధిని సాధించడంలోనూ ఎంతగానో తోడ్పడతాయి . అంటే ఒంటరిగా ఏదీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఉమ్మడిగా జరిగిన కృషికి అంతే స్థాయిలో వ్యక్తిగతంగా కూడా సహకారం , ప్రోత్సాహం, ఉత్సాహం, సమకాలీన అంశాల పైన చర్చలు ఎంత బాగా జరిగితే ఆ స్థాయిలో దేశంలో అభివృద్ధిని చూడవచ్చు . ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సరం పేరున జరుగుతున్నటువంటి తత0గం అక్కడక్కడ జరిగే సమావేశాలు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలపై సందర్భోచితంగానైనా చర్చించుకోకపోతే కొనసాగుతున్నటువంటి వ్యతిరేక కార్యకలాపాలను చట్టబద్ధంగాను న్యాయబద్ధంగానూ సమాజము ఆమోదించినట్లు అవుతుంది. ఇది వ్యవస్థ శ్రేయస్సుకు మంచిది కాదు .
ఆంగ్ల నూతన సంవత్సరం – వాస్తవాలు అపోహలు.ఏటా జనవరి ఒకటవ తేదీన ప్రారంభమయ్యే ఆంగ్లవత్సరాధి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా నూతన సంవత్సర కార్యక్రమాలను వేడుకలను జరుపుకోవడానికి పసిపిల్ల నుండి పండు ముదుసలి వరకు కూడా అతి ఉత్సాహాన్ని ప్రదర్శించడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం . కారణంఏదైనా అనాదిగా జనం ఈ భావనకు అలవాటు పడిన నేపథ్యంలో ఇప్పటికీ ఎంత ఖర్చైనా పెట్టడానికి, ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనడానికి ముఖ్యంగా యువత అన్ని వర్గాల వారు అన్ని వయస్సులవారు కూడా సిద్ధపడడాన్ని గమనించినప్పుడు దీని వెనుక ఉన్నటువంటి కారణాలను కూడా అన్వేషించవలసి ఉంటుంది .ఈ అంశం ఇట్లా ఉంటే కొన్ని సంస్థలు “జనవరి ఒకటి వద్దు ఉగాది ముద్దు” అనే పేరుతో అక్కడక్కడ పోస్టర్లు బ్యానర్ లను ప్రదర్శించిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు . నూతన వత్సరాది కార్యక్రమాలు లేదా వేడుకలు వ్యక్తిగతమైనవి అని అనుకున్నప్పటికీ అవి బయటి లోకంతో ఇతర వర్గాలు వ్యక్తులతో సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా జరుగుతున్నాయి. కనుక వీటి పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉన్నది .” వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం” అనే శ్రీ శ్రీ మాట చాలా సందర్భాలలో సామాజికత పట్ల అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి చాలా తోడ్పడుతుంది . ఇండ్లకు పరిమితమై చేసుకునే కార్యక్రమాలు వేడుకలు ప్రజానీకాన్ని పెద్దగా ప్రభావితం చేయవు. కానీ గతంలో అర్ధరాత్రి పూట ఉత్సవాల పేరుతో యువత మిగతా అన్ని వర్గాల వారు అన్ని వయసుల వారు కూడా అప్పుడప్పుడు కొంత శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన అనుభవాలు కూడా మనకు లేకపోలేదు . కాలానుగుణంగా వ్యక్తుల అలవాట్లు ఆలోచనలు వైఖరులు మారుతున్న నేపథ్యంలో విందులు, వినోదాలు, సామూహిక కార్యక్రమాలను మరింత విస్తృత పరిచే నేపథ్యంలో పరిధి దాటిన సందర్భాలను కూడా మనం గమనించవచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ క్లబ్బులు ,పబ్బులు, ఈవెంట్లు వివిధ రకాల ప్రదర్శనలు ముఖ్యంగా అశ్లీల అర్థనగ్న అసభ్య ప్రదర్శనలకు అవకాశం ఇస్తున్న నేపథ్యంలోనే ఈ చర్చ వీటి పట్ల వ్యతిరేకత రావడానికి బహుశా కారణం కావచ్చు. మరి కొంతమంది అభిప్రాయం ప్రకారంగా తెలుగు జాతికి పరిమితమై మాట్లాడుకున్నప్పుడు ఆంగ్లవత్సరాలతో మనకు సంబంధం ఏమిటి ?అనే ప్రశ్న కూడా వేస్తున్న వారు లేకపోలేదు. కానీ భారతదేశంలో జరుపుకుంటున్న ఈ పండుగ వేరువేరు రాష్ట్రాలలో వేరువేరు భాష సంస్కృతులు ఉన్నప్పటికీ వారి మాతృ సంస్కృతికి భిన్నంగా అంతర్జాతీయ ఆంగ్లవత్సరాధిని నిర్వహించుకోవడం ఒక నేరంగా తప్పిదంగా భావిస్తున్న వారు కూడా లేకపోలేదు .ఈ కార్యక్రమాలను వ్యక్తిగతానికి పరిమితం చేసుకొని సమాజానికి సమూహాలకు అన్యాయం, నష్టం, ద్రోహం జరగని రీతిలో నిర్వహించుకుంటే పెద్దగా అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు . ఇక వ్యక్తిగత విశ్వాసాలను పరిమితం చేసుకుంటూ మాట్లాడగలిగితే ఈ కార్యక్రమాలు మరింత వినూత్న రీతిలో కొనసాగితే బాగుండుననే సూచనలు అక్కడక్కడ వినబడుతున్నవి. సంస్కృతికి , ఐక్యతకు , కుటుంబ బంధాలకు, సామాజిక చింతనకు , బాధ్యతా నిర్వహణకు ఆటంకము కాని రీతిలో అదే సందర్భంలో వ్యక్తిగత బాధ్యతలను మరింత గుర్తించే విధంగా వ్యక్తి నిర్మాణాన్ని మానవాభివృద్ధిని ప్రోత్సహించే విధంగా ఈ వేడుకలు గనుక ఉండగలిగితే నిర్వహించడానికి పాలకులు వివిధ సంస్థలు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తే ఎవరికి అంతగా అభ్యంతరం ఉండదు . మానవ జీవితాన్ని విచ్చనం చేసే కార్యక్రమాలు ఈ సందర్భంగా పనికిరావు:-
క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లలో నిర్వహించబడుతున్నటువంటి వినోద విలాస ప్రజా సంస్కృతికి భిన్నమైనటువంటి వివిధ రకాల ప్రదర్శనలను ఇటీవల హైకోర్టు కూడా జనవరి ఒకటి సందర్భంగా రాత్రి 10 గంటల వరకు పరిమితం చేస్తూ ఇచ్చిన ఆదేశాలు తీసుకున్న నిర్ణయం ఆ ప్రదర్శనలు వ్యక్తి పైన చూపే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవే. అదే సందర్భంలో బార్లు మందు షాపులను వేడుకలు రాత్రి 12 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒంటిగంట వరకు కూడా అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన లేదా నిర్ణయం ప్రజల అలవాట్లను మద్యం వైపు దారి మళ్లించే విధంగా , ప్రోత్సహించే విధంగా, యువత మరింత పెడదారి పట్టే విధంగా ఉన్నాయని ముఖ్యంగా యువతను నిర్వీర్యపరిచే మద్యం తదితర కార్యకలాపాలు ఎంత పరిమితం చేస్తే అంత మంచిదని ఉన్మాద స్థితికి చేరుకోవడం మరింత అభ్యంతరకరమే కాదు ఆందోళన కలిగించే విషయమని విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు .ఇలాంటి వేడుకల సందర్భంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు అప్పుడప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ కు తలనొప్పిగా మారుతున్న విషయం కూడా కాదనలేనిది. అనేక ఇతర సామాజిక రుగ్మతలకు కూడా ఈ సంఘటనలు దారితీస్తున్నాయి. అలాంటప్పుడు పోలీసు శాఖ సాధారణ పరిపాలన శాఖ సంయుక్తంగా శాంతి సామరస్యాలను కాపాడడం కోసం ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇలాంటి వేడుకలను కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేయడం మంచిది . రాత్రి 1 వరకు ప్రజలకు ఇష్టారాజ్యంగా రోడ్ల పైన తిరిగే అవకాశం కల్పించినప్పుడు , మద్యం బార్లు స్వేచ్ఛగా అందుబాటులో ఉంచినప్పుడు ,ఆ మత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించినప్పుడు, ఎవరికైనా ఇది అసంబద్ధమే అని ఆలోచన రాక తప్పదు .కానీ యువత మిగతా కొన్ని వర్గాలకు మాత్రం ఆనందం కోసం ఈ సందర్భాన్ని అతిగా వినియోగించుకోవడం కూడా వికృత పరిణామాలకు దారి తీయవచ్చు . ఇక్కడ తల్లిదండ్రులు మరింత క్రియాశీలక పాత్ర పోషించడం అన్ని విధాల శ్రేయస్కరం .
ఎలాంటి కార్యక్రమాలు జరగాలి .నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొన్ని సంస్థలు మరికొన్నిచోట్ల స్థానిక సంస్థలు కూడా సమావేశాలు నిర్వహించి కేకులను కట్ చేసి సామూహిక అభిప్రాయాలతో పాటు భోజనాన్ని పంచుకొని వీలైతే కొన్ని విషయాలు మాట్లాడుకుని కార్యక్రమాన్ని పరిమితం చేసుకుంటున్న వాళ్లు కూడా ఎక్కువే. అదే సందర్భంలో గత సంవత్సరం కొనసాగిన విధానం పైన సమీక్ష జరిగి ముఖ్యమైన పరిణామాలు, సంఘటనలు, ఏ రంగాలు విఫలమైనాయి, పరిపాలనలో చోటు చేసుకున్న కొన్ని మంచి సందర్భాలు, ప్రజల కోణంలో పాలకులు చేసిన చట్టాలు, లేదా తీసుకున్న సంక్షేమ అభివృద్ధి చర్యలు కూడా రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు వివిధ సంస్థలు నిర్మోహమాటంగా రాజకీయాలకు అతీతంగా చర్చించుకోగలిగితే మరింత మంచిది . ఇదే సందర్భంలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ,ఆర్థిక రంగాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వికృత ధోరణులు అప్పుడప్పుడు కనిపించే కొన్ని మంచి ఆలోచనలను కూడా సమీక్షించుకోవడమవసరం. వ్యక్తిగత బాధ్యతను గుర్తింప చేయడం , సామాజిక బాధ్యతను నిర్వహించే క్రమములో నిబద్ధతను ప్రకటించడం , ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పైన నిర్మోహమాటంగా అభిప్రాయాలను వ్యక్తం చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి , రాసుకున్నటువంటి రాజ్యాంగ పలాలు క్రింది స్థాయిలో దేశ ప్రజలందరికీ అందడానికి, అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వంచన వంటి వివక్షతలు లేని మరింత మెరుగైన వ్యవస్థను రూపకల్పన చేసుకోవడానికి జరుగుతున్న కృషిలో మనమందరం ఎలా భాగస్వాములం కావాలి? అనే అంశం పైన చర్చ జరిగి ప్రతిజ్ఞ చేసి మన వంతు బాధ్యతను నిర్వహించడానికి కూడా నూతన సంవత్సర వేడుకలు సందర్భం కావాలి. కలుసుకోవడం ,భోజనం చేయడం, కేకులు కట్ చేసుకోవడంతో పాటు అక్కడక్కడ జరుగుతున్నటువంటి కేకలు, వికృత చేష్టలు, వెకిలి చేష్టలు , ఇతర ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే పనులు, అశ్లీల సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా సభ్య సమాజం పైన చాలా ఉన్నది .ప్రజాస్వామ్యంలో ప్రతి సందర్భంలోనూ ప్రజలకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు భావ ప్రకటన వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ వ్యవస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగించాలి. కానీ స్వార్థానికి , వ్యక్తిగత భావజాలానికి, కొన్ని సంస్థలకు మద్దతు పలకడం కోసం ఏ రకంగానూ ఈ సందర్భాలను ఉపయోగించకూడదు . అయితే స్నేహితులు వ్యక్తులు పరిచయం ఉన్నవాళ్లు మనిషిని సాటి మనిషిగా చూడగలిగే మానవత్వం మూర్తిభవించిన వాళ్లు ఈ సందర్భంగా తమ ఆకాంక్షలు పరస్పరం పంచుకోవడం ద్వారా కూడా వ్యతిరేక ఆలోచనలకు సమాధి చేసి సానుకూల దృక్పథం వెలుగు చూసే అవకాశం చాలా ఉన్నది . కుట్రపూరితంగాను, స్వార్థ ప్రయోజనాలతోనూ, ఏకపక్ష విధానంతోనూ, లేదా ఆధిపత్య భావజాలం తోనూ వ్యక్తులు వ్యవస్థ ఎవరు కూడా ఈ సందర్భంగా ప్రవర్తించడానికి వీలు లేదు అనే చర్చ అవగాహన సామాజిక అభివృద్ధి పైన బాధ్యత ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తించడం చాలా అవసరం. ఏడాదికి ఒకరోజు అది కూడా రాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే సన్నివేశాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని కొనసాగే వేడుకలు దారి మల్ల డా న్ని ఏ చట్టం, న్యాయం, మానవ సమాజం అంగీకరించకూడదు . అదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా కొత్త సంవత్సర సందర్భంగా ఎన్ని కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయింది అని ప్రకటనలు చేయడానికి సిద్ధపడక ఏ రకమైనటువంటి ప్రకటనలు ప్రజల నుండి వెలువడినవి? సభలు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తు ఆకాంక్షల పైన ప్రజల ఆరాటం వంటి అంశాలకు మాత్రమే పెద్దపీట వేసే విధంగా భవిష్యత్తులో మార్పులు జరగవలసిన అవసరం చాలా ఉన్నది . పత్రికా రంగం కూడా మద్యం అమ్మకాలపై ప్రజలకు వార్తల రూపంలో తెలియపరచడానికి కాకుండా వివిధ రకాల సభలు సమావేశాలు ప్రజల ఆకాంక్షలతోపాటు సానుకూల దిశలో ఏ రకంగా ఈ ఉత్సవాలు జరగాలి అనే సూచన చేస్తే బాగుంటుంది. అవకాశవాదం, వ్యక్తిగతవాదం, స్వార్థం , పరిమిత అవకాశాలను కోరుకునే వ్యక్తిత్వం కలిగిన ప్రజలను విశాల హృదయంతో ఆలోచించగలిగే దీర్ఘకాలిక పరిణామం వైపుగా తీసుకువెళ్లడానికి ఒక సందర్భంగా ఈ ఉత్సవాలు దోహదపడితే మతాలు ఇతర భావజాలం రీత్యా ఉన్న ఆలోచనల పైన ఎవరికి పట్టింపు ఉండదు. అభ్యంతరము కూడా అవసరం లేదు . జరగవలసిన చర్చ, జరగకూడని అన్యాయం ,ద్రోహం, యువతను నిర్వీర్యపరిచే మద్యంను అతిగా ప్రోత్సహించడం అనే విషయాలపై చర్చ జరగకపోతే ! విష పరిణామాలు చోటు చేసుకోవడమే కాదు సంవత్సరం అంతా తప్పుడు అభిప్రాయాలతోనే జీవించే అవకాశం ఉంటుందని అటు పాలకులు, ఇటు రాజకీయ పార్టీలు ,సంస్థలు, వాణిజ్య సంస్థలు, క్లబ్బులు పబ్బులను నిర్వహిస్తున్నటువంటి యాజమాన్య సంస్థలు గుర్తించి తమ కార్యకలాపాలను పరిమితం చేసుకొని అవసరమైతే రద్దు చేసుకోవడం ద్వారా కూడా ప్రజా సంస్కృతిని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది . నూతన సంవత్సర వేడుకల ఆశయం కూడా సమాజ ఉద్ధరణ గురించి ఉన్నప్పుడే ఉత్తమ సమాజం నిర్మాణం అవుతుంది . స్వార్థం ఉన్న చీమలు కూడా పాములకు నివాసాన్ని ఏర్పాటు చేసి ఇస్తాయి. మనం మనుషులం మనకేంటి ఇంత లోపం ఇంత స్వార్థం ఆస్తిని విశాల చేసుకోవడం కాదు. ఆత్మహైర్యాన్ని విశాలం చేసుకోవాలి మనిషి మృగ దశ నుంచి మానవుడిగా ఎదిగే క్రమంలో మళ్లీ మృగమే అవుతున్నాడు అంటే మానవుడు మహనీయుడు కావడం లేదు.

 

 

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
కాకతీయ యూనివర్సిటీ