వ్యవసాయంలో యాంత్రీకరణకు పెరుగుతున్న ప్రాధాన్యత

రాష్ట్ర మంత్రి పోచారం

సంగారెడ్డి,ఆగస్టు28  : వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కందిలో రూ.7.24 కోట్లతో నిర్మించిన వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల బాలుర, బాలికల నూతన వసతి గృహాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ. 25 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే మిగతా హాస్టళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అలాగే నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని గర్తు చేశారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధికి సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందించడం, పెట్టుబడులు సమకూర్చడం, సరైన మద్దతు ధర అందించడం ముఖ్యమైనవని తెలిపారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడాన్నారు. భవిష్యత్తులో రైతులు స్వంతంగా పెట్టుబడులు పెట్టుకొని వ్యవసాయం చేయాలని సూచించారు. రాష్ట్రంలో రైతు రాజు కావాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి రైతులకు లాభాలు వచ్చే విదంగా అధునాతన పద్దతులను వ్యవసాయ కళాశాల విద్యార్థులను విద్యార్థులు రూపొందించాల్సిన అవసరం ఉందని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడానికి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం తరఫున వేగంగా ఇప్పిస్తామని చెప్పారు. పీజేటీఏయూకు దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయం లో 12 ర్యాంకు వచ్చిందని వెల్లడించారు. దేశంలో రైతులు అసంఘటితంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని 10800 రెవిన్యూ గ్రామాలను 3600 యూనిట్లుగా విభజించి సెప్టెంబర్‌1 నుంచి 9 వరకు గ్రామ రైతు సమన్వయ సంఘాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి సమన్వయ సంఘంలో 1/3 వంతు మహిళలు ఉంటారన్నారు. సెప్టెంబర్‌ 10 నుంచి 14 లోగా మండల రైతు సమన్వయ సంఘాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వచ్చే రెండు ఏళ్ళలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు కుట్రలతో అడ్డంపడినా సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పాదాలను కడుగుతామని వివరించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణను దేశంలో నెంబర్‌ వన్‌ గా తీర్చిదిద్దటమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీజేటీఎస్‌ఏయూవైస్‌ చాన్సలర్‌ ప్రవీణ్‌ రావు, ఆగ్రోస్‌ చైర్మన్‌ కిషన్‌ రావు, సంగారెడ్డి శాసనసభ్యుడు చింతా ప్రభాకర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు