వ్యవ’సాయ’బడ్జెట్‌

రూ.25,962 కోట్ల తో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కన్నా
హెదరాబాద్‌, మార్చి 18 (జనంసాక్షి):
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక వార్షిక ప్రణాళికను ప్రకటించింది. రైతుల సంక్షేమానికి కీలక విధాన నిర్ణయాలు ప్రకటించింది. లక్షలోపు రుణాలు తీసుకున్న వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రూ.లక్ష నుంచి రూ. 3 లక్షల లోపు రుణాలను పావలా వడ్డీపై ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచామన్నారు.. అలాగే, రైతులకు మద్దతు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.100 కోట్ల నిధులతో ఆలంబన నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది రూ.72,450 కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక వ్యవసాయ
వార్షిక ప్రణాళికను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.25,962 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర, రైతు శ్రేయస్సు కోసమే ప్రత్యేక విధాన పత్రం ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో వ్యవసాయ ఉప ప్రణాళిక విశిష్టమైనదని చెప్పారు. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి శ్రేయస్సుకు తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.
మొత్తం రూ.25,962 కోట్ల వ్యవసాయ బడ్జెట్‌లో వ్యవసాయ ప్రణాళికా వ్యయం రూ.17,694 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.8,267 కోట్లు. ఈ ఏడాది రూ.72,450 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6,128 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులను ఆదుకొనేందుకు వ్యవసాయ
బడ్జెట్‌లో రూ.589 కోట్లు వెచ్చించారు. కనీస మద్దతు ధరలి లభించని సమయంలో రైతులను ఆదుకొనేందుకు రూ.100 కోట్లతో ఆలంబన నిధి ఏర్పాటు చేయననున్నట్లు ప్రకటించారు. 83 వేల టన్నుల ఆహార ధాన్యాల నిల్వల కోసం రూ.42 కోట్లతో 39 మండల స్థాయి గోదాములు నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తామని ప్రకటించారు. వ్యవసాయ విద్యుత్‌ రాయితీ కోసం రూ.3,621 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. జైకా సహకారంతో 16 జిల్లాల్లో 2.43 లక్షల పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు రూ. 1154 కోట్లు కేటాయించామన్నారు. వడ్డీ లేని పంట రుణాల కోసం రూ.500 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అలాగే, విత్తనాభివృద్ధికి రూ.308 కోట్లు, సోలార్‌ పెంప్‌సెట్లకు రూ.150 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.450 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.100 కోట్లు, వర్షాధారిత వ్వయసాయ అభివృద్ధకి రూ.220 కోట్లు, భూసార అభివృద్ధి, నిర్వహణకు రూ.2,309 కోట్లు, పంటల బీమాకు రూ.410 కోట్లు కేటాయించామన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని పెంచనున్నట్లు తెలిపారు. సజ్జ, రాగులకు ఇన్‌పుట్‌ సబ్సిడీరూ.3 వేల నుంచి రూ.5 వేలు, మామిడి, ఇతర పంటలకు రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పెంచుతున్నట్లు తెలిపారు.
వ్యవసాయ బడ్జెట్‌..
వ్యవసాయ బడ్జెట్‌ రూ.25,962 కోట్లు
ప్రణాళికా వ్యవయం రూ.17,694 కోట్లు
ప్రణాళికేతర వ్యవయం రూ.8,267 కోటు