వ్యవసాయానికి వడ్డీలేని రుణమివ్వాలి
మెదక్,జనం సాక్షి ): రాష్ట్రవ్యాప్తంగా రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని పంటలుసాగు చేస్తారని,దీంతో వచ్చిన దిగుబడి వడ్డీలకే సరిపోతుందని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే పొలాలను తాకట్టు పెట్టుకుని బ్యాంకుల ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, దీంతో వ్యవసాయ పెట్టుబడికి రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. వరికి మద్దతు ధర పెంచాలన్నారు. రైతులు పంటల సాగుకు అష్టకష్టాలు పడుతున్నారని, పెట్టుబడి, ప్రకృతి విపత్తులు, నీటి కొరత, ఆ తర్వాత గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉపాధి హావిూని అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం భూగర్భజలాలు తగ్గిపోయి, జలవనరులు ఎండిపోయి సాగునీరు అందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొందని వాపోయారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు రైతులు నష్టపోయారని చెప్పారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎకరాకు రూ.20 వేల పరిహరం చెల్లించాలని కోరారు.