వ్యాక్సిన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయండి మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ లేబరేటరీని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే. తారకరామారావు లేఖ రాశారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా ఉందని, ప్రతి సంవత్సరం ఆరు బిలియన్ల డోసుల వ్యాక్సిన్లను ఇక్కడి బయోటెక్‌ కంపెనీలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం మొత్తంలోని వాక్సిన్‌లలో మూడవ వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలోనే తయారవుతున్నాయన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్నందునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 80 దేశాలకు చెందిన రాయబారులు జీనోమ్‌ వ్యాలీని సందర్శించి కొవిడ్‌- 19కి సంబంధించి వ్యాక్సిన్‌ తయారీపై వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు.

 

దేశంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ లాబరేటరీని ఏర్పాటు చేయాలని గతంలో ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి మరింత వేగంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వెంటనే ఇక్కడ ప్రత్యేకంగా టెస్టింగ్‌ లేబరేటరీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్‌ల తయారీకి సంబంధించి సెంట్రల్‌ డ్రగ్‌ లేబరేటరీ హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో ఉన్నదని, ప్రతిసారి అక్కడికి తమ వ్యాక్సిన్లను పంపి పరీక్షించడం, సర్టిఫికేషన్‌ పొందడంలో హైదరాబాద్‌ బయోటెక్‌ కంపెనీలు సమయాభావాన్ని ఎదుర్కొంటున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

 

కేంద్ర ప్రభుత్వం జీనోమ్‌ వ్యాలీ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మరిన్ని ప్రయోగాలను, పరిశోధనను పెంచే ఉద్దేశంతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందన్నారు. ఈ సంస్థకు కావాల్సిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించి దాని ఏర్పాటులో చొరవ తీసుకున్న విషయాన్ని సైతం మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సంస్థకు ఇచ్చిన బాధ్యతల్లో ప్రత్యేకంగా వ్యాక్సిన్లు, మెడికల్‌ డివైస్‌ టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ బాధ్యత కూడా ఉందన్నారు. భారత ప్రభుత్వం తరఫున ఈ విధులను ఇక్కడి సంస్థ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో అటు పరిశ్రమలకి, ఇటు సంస్థకి ఉభయతారకంగా ఉండేలా నేషనల్‌ డ్రగ్‌ లేబరేటరీ జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని కేటీఆర్‌ అన్నారు.

 

ప్రస్తుతం కోల్‌కతా, ముంబై, చెన్నై, కర్నాల్‌ లలో మాత్రమే ఉన్న ప్రభుత్వ మెడికల్‌ స్టోర్‌ డిపోను ఇక్కడ ఏర్పాటు చేయాలని మంత్రి తన లేఖలో కేంద్రాన్ని కోరారు. వాక్సిన్‌ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ, వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఈ డిపో ఏర్పాటును అంతర్జాతీయ ప్రమాణాలతో డాటా మానిటరింగ్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టం వంటి సౌకర్యాలతో ఏర్పాటు చేస్తే ఆయా కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలకు, భారత వ్యాక్సిన్‌ తయారీ రంగానికి ఎంతో మేలు చేసిన వారవుతారని మంత్రి అన్నారు. ఈ రెండు విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని వెంటనే నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్‌ లేఖలో వ్యక్తం చేశారు.