శంకర్రావుపై ఖాకీల జులుం .. నిరసనలకు తలొగ్గిన సర్కార్‌

విచారణకు ఆదేశం
హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) :
శంకర్‌రావుపై పోలీసుల జులుం, తదనంతర పరిణాలమాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆయన అరెస్టు సమయంలో పోలీసులు వ్యహరించిన తీరుపట్ల ప్రజా, దళిత సంఘాలతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బాహాటం గా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. సర్వత్రా విమర్శలు రావడం, నిరసనలు వ్యక్తం కావడంతో నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. సిఐడి అదనపు డిజిపి కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో విచార కమిటీ వేయాలని ఆదేశించారు. ఈ మేరకు డిజిపిని ఆదేశించారు. సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో మెత్తం ఘటనపై ఉన్నత స్థాయి కోణాల్లో విచారణ జరిపించాలని డీజీపీని సీఎం ఆదేశించారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. పోలీసులు అతిగా ప్రవర్తించారని పలువురు మంత్రుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఉదయం నుంచి నాటకీయ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సిఎం దామోదర్‌ రాజనర్సింహ, పలువురు మంత్రులు సిఎంతో భేటీ అయి శంకర్‌ రావు అరెస్ట్‌పై నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీస్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శంకర్రావు విషయంలో పలు ఛానళ్లను కట్టడి చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. శంకర్రావు అరెస్టును అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఛానళ్లపై మండిపడ్డారు. మాజీ మంత్రిని అరెస్టు చేసినంత మాత్రానా అంతస్థాయిలో ప్రచారం అవసరమా అని మీడియా ప్రతినిధులను సీఎం ప్రశ్నించారు. మరోవైపు డీజీపీ దినేష్‌రెడ్డితో ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ, సైబరాబాద్‌ సీపీ, మల్కాజ్‌గిరి డీసీపీ భేటీ అయ్యారు. సమావేశంలో శంకర్రావు అరెస్టుకు సంబంధించిన వివరాలను డీజీపీ తెలుసుకున్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో సీఎంతో డీజీపీ భేటీ అయ్యారు. శంకర్‌రావు అరెస్ట్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ¬ంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి, సీపీ అనురాగశర్మ క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. నేరేడ్‌మెట్‌ సీఐని కూడా క్యాంప్‌ ఆఫీసుకు పిలిపించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి ప్రసాద్‌కుమార్‌ కలిశారు. శంకర్రావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. శంకర్రావుపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నవించినట్లు  సమాచారం. మాజీ మంత్రి శంకర్రావు అరెస్టుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. శంకర్రావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సీఎంకు ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. శంకర్రావు అరెస్టు వ్యవహారంలో ఉన్నతాధికారులతో విచారణకు సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. తనకు తెలియకుండానే అరెస్టు జరిగిందని, జరిగిన ఘటనకు చింతిస్తున్నానని సీఎం తెలిపారని మంత్రి పేర్కొన్నారు. అరెస్టుకు బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేస్తామని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై నాగర్‌కర్నూలు ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. సీఎంకు మానవత్వం ఉంటే శంకర్రావు అరెస్టు చేసిన తీరును చూసి స్పందించాలన్నారు. పోలీసుల ప్రవర్తనపై సీఎం సమాధానం చెప్పాలని మందా డిమాండ్‌ చేశారు. శంకర్రావు అరెస్టు వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి శంకర్‌రావు అరెస్ట్‌ పట్ల ప్రభుత్వ తీరు సరికాదని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం కేసును ఉపసంహరించుకోనందుకే శంకర్‌రావుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. యూత్‌ కాంగ్రెస్‌ శంకర్‌రావు వెనుకే ఉంటుందని ఎమ్మెల్యే విష్ణు తెలిపారు. కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్‌రావును టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం ఉదయం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుడు కాబట్టే శంకర్‌రావు పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని మోత్కుపల్లి డిమాండ్‌ చేశారు. కాగా మాజీ మంత్రి శంకర్రావును అరెస్టు చేయలేదని మల్కాజ్‌గిరి డీసీపీ శివకుమార్‌ స్పష్టం చేశారు.