శక్తివంతమైన దేశంగా భారత్
– ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,నవంబర్24(జనంసాక్షి): చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఆర్థికంగా దూసుకెళుతోందని, శక్తివంతంమైన దేవంగా ఎదుగుతోందని.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం భారత్-సింగపూర్ ఆర్థిక సదస్సులో ఆయన ప్రసంగించారు. సింగపూర్‌తో సాంస్కృతిక, చారిత్రక బంధం ఈ పర్యటనతో మరింత బలపడిందని, సింగపూర్ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రెండు దేశాలు వాణిజ్య, రక్షణ పరమైన సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకునేందుకు అంగీకరించాయి. అటు ఇరుదేశాల దౌత్య సంబంధాలు అర్ధశతాబ్ధంగా కొనసాగుతున్న నేపథ్యంలో సంయుక్త స్టాంప్‌ను విడుదల చేశారు. సింగపూర్ ప్రధాన మంత్రి లీతో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సుమారు 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాధినేతల సమక్షంలో దౌత్య అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీకి ఇస్తానలోని అధ్యక్ష భవనంలో సాదర స్వాగతం లభించింది. అక్కడ మోదీ సైనిక వందనం స్వీకరించారు. ఆ దేశ అధ్యక్షుడిని మోదీ కలిసారు. అటు భారత-సింగపూర్ దౌత్య సంబంధాలు 50 యేళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల ప్రధాన మంత్రులు సంయుక్త స్టాంపులు విడుదల చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.