శతాబ్ధాల నాటి పురాతనమైన బంకర్

jyo5ముంబైలోని మహారాష్ట్ర గవర్నర్ అధికార నివాసం రాజ్‌ భవన్‌ లో పురాతన బంకర్‌ ను కనుగొన్నారు. శతాబ్ధాల నాటి పురాతనమైన ఈ బంకర్‌ ను మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు చొరవతో వెలుగులోకి తెచ్చారు. 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ బంకర్‌ ను పురావస్తు శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తో కలిసి బంకర్‌ మొత్తాన్ని గవర్నర్‌ పరిశీలించారు.

ఒకటి కాదు రెండు ఏకంగా 150 మీటర్ల పొడవైన పాతకాలం నాటి బంకర్ ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు వెలుగులోకి తెచ్చారు. రాజ్ భవన్ పరిసరాల్లో ఓ భారీ బంకర్ ఉందని ఆయనకు కొందరు పూర్వీకులు సమాచారం ఇచ్చిన మేరకు దీనిని వెలుగులోకి తెప్పించారు. ఆయన ఉంటున్న మల్బార్ హిల్స్ లోని రాజ్ భవన్ కింద దీనిని గుర్తించారు. సాధారణంగా ఉండే బంకర్లకంటే ఇది భిన్నంగా ఉంది. పొడవైన వరండాకు అటు ఇటు చిన్నచిన్న గదులతో ఉన్న ఈ బంకర్ ఆశ్యర్యం గొలిపేలా ఉంది.

ఈ బంకర్‌ కు రెండు వైపులా 20 అడుగుల ఎత్తయిన తలుపులు ఉన్నాయి. ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థతో పాటు గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ బంకర్‌ ను మూసివేశారు. నిర్వహణ లేకుండా దశాబ్దాలు గడుస్తున్నా గానీ ఇప్పటికీ ఈ బంకర్‌ చెక్కు చెదరకుండా ఉంది.

గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర అధికారులు ఈ బంకర్ ను సందర్శించారు. పురావస్తు శాఖకు ఈ బంకర్‌ సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్పారు. ఈ బంకర్ లో మొత్తం 13 గదులు ఉన్నాయి. 5000 చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఇందులో షెల్ స్టోర్, గన్ షెల్, కాట్రిజ్ స్టోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్ షాప్ పేర్లతో రూములు ఉండటం విశేషం.