శనిలా పట్టిన కాంగ్రెస్‌ బిజెపిలు

                                                                              ఈ రెండు పార్టీలతో ఒరిగేదేవిూ లేదు
మండిపడ్డ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
నల్లగొండ,మే11(జ‌నం సాక్షి ): ఈ దేశానికి, రాష్ట్రానికి  పట్టిన శని  కాంగ్రెస్‌, బీజేపీ అని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. రైతు బంధు చెక్కుల పంపిణీతో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం పర్వతగిరిలో రైతులకు పాస్‌ పుస్తకాలు, రైతు బంధు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. దేశంలోని రైతులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ దార్శనికత, సంకల్పం నేడు దేశంలో పలు మార్పులకు నాంది పలుకుతుందన్నారు. ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని ఈ కాంగ్రెస్‌, బీజేపీ అని దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలతో ఒరిగిందేమి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలు గాంధీ భవన్‌లో కూర్చొని మాట్లాడటం కాదు.. ఒక్కసారి గ్రామాల్లోకి వచ్చి రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి సూచించారు.  అయితే  రైతు బంధు చెక్కుల పంపిణీతో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. అందుకే పథకం వల్ల తమకు పుట్టగతులు ఉండవనే విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మనమే ముందున్నామని  మంత్రి  అన్నారు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గ్రామాల అభివృద్ధి పైనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారన్నారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చర్యలు తీసుకుందని తెలిపారు. అందులో భాగంగానే రైతుబంధు కింద ఈనెల 10 నుంచి రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.  రైతులు ఆనందంగా ఉన్నపుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని ప్రభుత్వం భావిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలను ఎద్దేవా చేసే బీజేపీ నేడు కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం మన రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలను కాపీ కొట్టి అక్కడ మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. దేశంలో అభివృద్ధిలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలన చూసి ప్రజలు వచ్చే 20ఏళ్ల పాటు టీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు.
వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు సంక్షేమ పథకాల అమలు చూసి నేడు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి, పార్టీ నాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.
———-

తాజావార్తలు