శరద్‌ యాదవ్‌కు సుప్రీం షాక్‌ 

వేతనం, అలవెన్స్‌లు నిలిపివేయాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నం సాక్షి) : జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నుంచి అనర్హత వేటుకు గురైన ఆయనకు ప్రస్తుతం లభిస్తున్న వేతనం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. శరద్‌ యాదవ్‌కు వేతనం, అలవెన్సులు, రైలు, విమాన టికెట్ల వంటి ఇతర సౌకర్యాలు నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవరిస్తూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే రాజ్యసభ నుంచి శరద్‌ యాదవ్‌ అనర్హత వేటు అంశం పరిష్కారమయ్యే జులై 12 వరకూ న్యూఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయకుండా ఆయనకు ఊరట కల్పించింది. రాజ్యసభ నుంచి తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ శరద్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను వేగవంతం చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన సుప్రీం వెకేషన్‌ బెంచ్‌ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.కాగా న్యూఢిల్లీలోని అధికార నివాసంలో నితీష్‌ కుమార్‌ కొనసాగవచ్చన్న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జేడీ(యూ) దాఖలు చేసిన పిటిసన్‌పై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. జేడీ(యూ) రాజ్యసభ ఎంపీ రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ మే 18న దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరిస్తూ సుప్రీం కోర్టు శరద్‌ యాదవ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.