శరవేగంగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు
ప్రత్యక్ష పర్యవేక్షణలో శిల్పు కళాకృతులు
యాదాద్రి భువనగిరి,నవంబర్2(జనంసాక్షి): తిరుమలకు దీటుగా శ్రీలక్ష్మీనరసింహుడికి యాదాద్రి ఉండాలని సంకల్పించారు. యాదాద్రి ఆలయం ఓ అద్భుత క్షేత్రంగా వెలుగొందేలా ఇక్కడ నిర్మాణాలకు శ్రీకరాం చుట్టగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాడా ప్రత్యేకాధికారి కిషన్ రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో పక్కాగా పనులు సాగుతున్నాయి. భవిష్యత్తులో పెరుగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రంలో వసతుల కల్పన జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. రోజుకు లక్ష మంది భక్తులు వచ్చినా దైవదర్శనాలు, పూజలు, వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వరాదని దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ పునర్నిర్మాణం తుదిరూపు దాల్చాల్సిందేనని ఆదేశించడంతో పనుల్లో వేగం పుంజుకుంది. ఈ నిర్మాణాలన్నీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆధ్యాత్మిక దేవనగరిగా యాదాద్రి రూపుదిద్దుకుంటున్నది. సీఎం మహాసంకల్పంతో తిరుమలను తలపించే విధంగా నిర్మాణాలు జరుగు తున్నాయి. కృష్ణశిల్ప సౌందర్యాలు, సప్తగోపురాలు, ఆలయ ప్రాకారాలు, బాహ్య ప్రాకారాలు,మాడ వీధులు శ్రీవైష్ణవ విశిష్టతను చాటిచెప్పే 12 ఆళ్వార్ మహాస్తంభాలు,కాకతీయ మహారాజుల రాజసాన్ని చాటిచెప్పే సంప్రదాయ స్తంభాలు, వాటిపైన 55 అడుగుల ఎత్తులో స్వర్ణగోపురం ఇలా అన్నీ ఆకట్టుకునే రీతిలో సాగుతున్నాయి. శివాలయం వీధిలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన యాదాద్రి క్షేత్రపాలక ఆంజనేయస్వామి కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు కాబోతున్నది. తూర్పుదిశలో ప్రతిపాదిత 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఆంజనేయుడు ఉంటారు. యాదాద్రి లో ఎటు చూసినా పచ్చదనం… ఉల్లాసభరిత ఉద్యానవనాలు… సకల సదుపాయాలతో కూడిన వసతి గృహాలు… హెలిప్యాడ్ నిర్మాణాలు…రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం…ఇలా సకల పనులు ఏకకాలంలో మొదలై మూడేళ్లుగా ఆలయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రిలో 2014 అక్టోబర్ 17న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొన్నటి దసరాకు పనులు కావాలని సంకల్పించినా శిలలతో చేపట్టిన పనుల కారణంగా కొంత ఆలస్యం అవుతోంది. ఒకవైపు యాదాద్రి అభివృద్ధి ప్రగతి పరుగులు పెడుతుండగా, అదే స్థాయిలో పర్యాటక రంగం ఊపందుకున్నది. యాదాద్రిలో ఇప్పుడు జరుగుతున్న పనులను ఎవరూ ఊహించలేదు.యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రారంభించి సీనియర్ ఐఏఎస్ అధికారి జి.కిషన్‌రావును వైస్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించాకయాదాద్రిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరగడం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పనులను పర్యవేక్షిస్తున్న అరుదైన సన్నివేశం యాదాద్రిలో ఆవిష్కృతమవుతున్నది. ఆధ్యాత్మిక దేవనగరి యాదాద్రి రూపుదిద్దుకుంటున్నది. సీఎం మహ సంకల్పంతో యాదాద్రి మరో తిరుమలను తలపించే విధంగా యాదాద్రిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. రహదారులు, క్యూలైన్ల వ్యవస్థను ప్రత్యేక దృష్టితో నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ప్రత్యామ్నాయంగా నిర్మించిన బాలాలయంలో స్వామి దర్శనానికి నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయినా నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా చేస్తున్నారు. వీలైనంత వరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టారు. ఇకపోతే ఆలయ నిర్మాణంలో భాగంగా దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మూడంతస్తుల్లో క్యూలైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. వంటశాల, ప్రసాదాల
తయారీ శాలలను కూడా ఆధునిక పద్దతుల్లో నిర్మిస్తారు. ఆగ్నేయ ప్రాంతంలో ఈ కట్టడాలపై ఇటీవల ముఖ్యమంత్రి సందర్శించినప్పుడు పలు సూచనలు చేసారు. అన్నదాన సత్ర భవనంపై నీటి ట్యాంకును నిర్మించనున్నారు. స్నానగుండం, మంచినీటి సరఫరా వ్యవస్థ, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా ఏర్పాట్లను ఆధునిక పద్దుతుల్లో నిర్మిస్తారు. మొదటి దశలో 200 కాటేజీలు, ఉద్యనవనాలు, క్యాంటీన్ తదితర నిర్మాణాలను చేపడతారు. ప్రధాన ఆలయానికి ఈశాన్యంలోని 13 ఎకరాల స్థలంలో వీవీఐపీల బస కోసం అధునాతన వసతులతో కూడిన ప్రత్యేక భవన సముదాయాలను నిర్మించాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇందులో ఒకటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్టాల్ర గవర్నర్లు, ముఖ్యమంత్రుల కు.. మిగిలినవి కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల విడిది కోసం మొత్తం 15 ప్రత్యేక భవన సముదాయాలను నిర్మించాలని సూచించారు. యాదాద్రిలో కాటేజీల నిర్మాణానికి అనేక మంది దాతలు, కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయని త్వరగా లేఅవుట్లు రూపొందించి నిర్మాణాలను ప్రారంభించారు. ఆ మేరకు ప్రత్యేకాధికారి కిషన్ రావు చర్చించి సూచనలు ఇస్తున్నారు. ఈ పవిత్ర క్షేత్రాని కొచ్చే యాత్రికులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా నాలుగు వరుసల రహదారులను నిర్మించి రాచబాట వేస్తారు. ఇలా నిర్మాణాలతో పాటు ఉద్యానవనాలు నిర్మిస్తారు. స్వామి వారి నిత్య కైంకర్యాలకు అవసరమైన పూల పెంపకాన్ని స్థానికంగానే చేపట్టేలా ఉద్యానవనాలు నిర్మిస్తారు. దీని కోసం ప్రత్యేక ఉద్యానవనాలను నిర్మించాలని అటవీ అధికారులను ఆదేశించారు.