శవమివ్వలేదు బొంద చూపండి కన్నీటి నివాళులర్పిస్తాం

అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అభ్యర్థన
శవమివ్వలేదు బొంద..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :
మృతదేహం ఇవ్వలేదు, శవాన్ని పూడ్చిపెట్టిన చోటైనా చూపండి కన్నీటితో నివాళులర్పిస్తామని అఫ్జల్‌ గురు కుటుంబ సభ్యులు తీహార్‌ జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు డీజీ (ప్రిజన్స్‌) విమల మెహ్రాకు వారి పక్షాన లాయర్లు లేఖ పంపారు. పార్లమెంట్‌పై  దాడికి సూత్రదారిగా పేర్కొంటూ ఆయనను మూడు రోజుల క్రితం తీహార్‌ జైళ్లో ఉరితీసిన విషయం విదితమే. గురుకు ఉరివిషయంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, దేశ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. గురు ఉరి విషయం తమకు ముందుగా తెలుపలేదని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మృతదేహాన్ని అప్పగించి సంప్రదాయం ప్రకారం ఖననం చేసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈమేరకు జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సభ్యులు లేఖ రాశారు. తమ పక్షాన కేంద్ర హోం మంత్రిత్వ శాఖను, తీహార్‌ జైలు అధికారులకు విన్నవించాలని వారు కోరారు. అయితే కేంద్రం మాత్రం ముందస్తుగానే గురు కుటుంబానికి సమాచారమిచ్చామని, నిబంధనల మేరకు శవాన్ని పూడ్చిపెట్టామని అధికారులు పేర్కొన్నారు.