శవాల మధ్య పడుకున్నాం..

4
– చనిపోయినట్లుగా నటించాం..

– బతికి బయటపడ్డాం

హైదరాబాద్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): నాటకంలో నటించడం సరే తుపాకీ మోతలు, శవాల గుట్టలు పారుతున్న రక్తపుటేరుల మధ్య కళాకారులు నటించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణాలు పోయినట్టుగా నటించారు. వివరాల్లోకి వేళ్తే  ”వేదిక మీద నాటకం మొదలైంది. ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నాం.. ఇంతలో ఒక్కసారిగా ఢాం ఢాం ఢాం అని శబ్ధం వచ్చింది. అది కూడా నాటకంలో ఓ భాగమేనని అనుకున్నాం. ఇంతలో నా పక్కనుంచి ఏదో వెళ్లింది. తిరిగి చూసేసరికి నా పక్కన ఉన్న వాళ్లంతా నేలమీద పడిపోయారు. అంతాక్షణంలో జరిగిపోయింది. రక్తం ఏరులై పారుతోంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భయంభయంగా చుట్టూ ఉన్న శవాల మధ్య పడుకుని చనిపోయినట్లుగా నటించి తాము బతికిపోయాం..” పారిస్‌లోని బటక్లాన్‌ థియేటర్‌ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్ష్యుల మాటలివి. ఫ్యాషన్‌ ప్రపంచానికి వేదికైన అందమైన పారిస్‌ నగరం మూగబోయింది. శుక్రవారం రాత్రి నగరంపై ముష్కరులు విరుచుకుపడ్డారు. నగరంలోని పలుచోట్ల కాల్పులు, దాడులకు పాల్పడి మొత్తం 128మందిని బలితీసుకున్నారు. ఒక్క బటక్లాన్‌ థియేటర్లోనే దాదాపు 100మందిని బందీలుగా చేసుకుని తూటాల వర్షం కురిపించారు. అనంతరం తమను తాము పేల్చుకుని ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో బటక్లాన్‌ థియేటర్లోని 80మంది మృతిచెందారు. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆస్గేలియాకు చెందిన జాన్‌ లీడర్‌, ఆయన కుమారుడు ఆస్కార్‌ ఆ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. నలుగురు ముష్కరులు థియేటర్లోకి ప్రవేశించారని.. తమ వద్ద ఉన్న తుపాకీలతో పిట్టలను కాల్చినట్లు కాల్చేశారన్నారు. ఆ ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేందుకు తాము మృతదేహాల మధ్య చనిపోయినట్లు నటించి పడుకున్నామన్నారు. దీంతో వారు తమని చూడలేదని.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులు జరిపిన సమయంలో తాము బయటకు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నామన్నారు.