శాంతి భద్రతల పరిరక్షణే ప్రధానమన్న : సీఎం

తెలంగాణలో అవతరణ దినోత్సవాలకు
దూరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు బోసిపోయిన కలెక్టరేట్లు
హెదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి):
మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతన్నను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వచ్చే రెండేళ్లలో రూ. 16 కోట్లు ఖర్చు చేసి 30 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన రాష్టావ్రతరణ దినోత్సవాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. సాగురైతులకు ఈ ఏడాది రూ.2 వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తన్నట్లు ప్రకటించారు. మన రాష్ట్రంలోనే దేశం మొత్తంవిూద పది శాతం రుణాలు రైతులకు అందజేస్తున్నా మన్నారు. అలాగే, 32 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని
చెప్పారు. రైతన్నకు ఎంత మేలు చేసినా తక్కువేనని నమ్మే ప్రభుత్వం తమదన్నారు. ఆక్వా రంగానికి రూ.468 కోట్ల బకాయిలు రద్దు చేసినట్లు వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణకు కూడా నిధులు పెంచామన్నారు. రైతులను ఆదుకోవడమే తమ లక్ష్యయమని చెప్పుకొచ్చారు. అందుకే భారీ ఎత్తున జలయజ్ఞం చేపట్టామని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు పూర్తి చేశామని, రానున్న రెండేళ్లలో మరో 20 ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో రూ.16 వేల కోట్ల నిధులు ఖర్చు చేసి అదనంగా మరో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వివరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌లను ఆదర్శంగా తీసుకొని పని చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి శాంతిభద్రతల పరిరక్షణ చాలా ప్రధానమని సీఎం పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడం కోసం, శాంతిభద్రతలన పరిరక్షించడంలో రాజీ ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో కొన్ని అవాంతరాలు ఉన్నా.. వీలైనంత మేరకు సరఫరా చేస్తున్నామని సీఎం కిరణ్‌ తెలిపారు. విద్యుత్‌ రంగంలో సమస్యలున్నా.. 32 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు 286 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా.. 225 మిలియన్‌ యూనిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నామని తెలిపారు. కొరతను అధిగమించడానికి అందుబాటులో ఉన్న మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే అదనంగా 16 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని వివరించిన ముఖ్యమంత్రి.. 2013 డిసెంబర్‌ నాటికి దక్షిణ గ్రిడ్‌ అనుసంధానం పూర్తి చేస్తామని తెలిపారు.