శిక్కుల ఊచకోత నిందితులను శిక్షించి ఉంటే గుజరాత్ అల్లర్లు జరిగేవికావు
– కేజ్రీవాల్
న్యూఢిల్లీ నవంబర్ 1 (జనంసాక్షి):
1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం జరిగి, నిందితులను శిక్షించి ఉంటే 2002లో గుజరాత్ అల్లర్లు, ఇటీవల దాద్రి ఘటన జరిగేవి కాదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఘటన జరిగి 31 ఏళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1984 ఘటన బాధితులకు ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. నష్టపరిహారం విషయంలోనూ ఎటువంటి మార్పులేదన్నారు. బాధితుల నష్టపరిహారాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడతామని హామీ ఇచ్చినా.. అది ఇంతవరకు ఆచరణలోకి రాలేదన్నారు. వారికి న్యాయం జరిగితే..2002లో గుజరాత్ అల్లర్లు జరిగేవీ కాదన్నారు.
అల్లర్ల బాధితులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. ఇందిరా గాంధీ హత్య తర్వాత ఢిల్లీ, దాని శివార్లలో సిక్కులను ఊచకోత కోశారు. ఈ అల్లర్లలో నష్టపోయిన బాధితులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఇవాళ 1,320 మంది బాధితులకు చెక్కులు ఇచ్చారు. మిగతా 1800 కుటుంబాలకు త్వరలోనే చెక్కులను పంపిణీ చేయనుంది.సిక్కు అల్లర్ల బాధితులకు అందించే నిధులను కేంద్రప్రభుత్వం తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఖాతాలో జమ చేయనుంది. అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించినపుడే పూర్తి స్థాయిలో న్యాయం జరిగినట్లవుతుందని, దయచేసి తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. సిక్కులపై సామూహిక దాడులు జరిగిన 31 ఏళ్ల తర్వాత బాధితులకు పరిహారం ఇచ్చారు. మన ఆలోచనా విధానం మారకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం చోటుచేసుకున్న సిక్కుల ఊచకోత అంశాన్ని బీజేపీ సహా ఇతర పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నాయే తప్ప, బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
‘అల్లర్లు జరిగి 31 ఏళ్లు గడిచాయి. సిక్కులను దారుణంగా చపినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు. వాళ్లను చూస్తే మన రక్తం మరిగిపోతుంది. ఇంకా ఘోరమైన విషయమేమంటే ఈ ఏడాది ప్రారంభంలో ఆమ్ ఆద్మీపార్టీ అధికారంలోకి వచ్చాకగానీ 1984 అల్లర్లపై సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటుచేయలేదు’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో దాదాపు 3 వేల మంది హత్యకుగురైన సంగతి తెలిసిందే.