శిక్ష తగ్గించే ప్రసక్తే లేదుశిక్ష తగ్గించే ప్రసక్తే లేదు

– నిర్భయ కేసులో దోషులకు ఉరే సరి
– రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా మహిళా సంఘాల హర్షం
న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు శిక్ష తగ్గించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ఈ కేసులో మరణ శిక్ష పడ్డ ముగ్గురు ముద్దాయిలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. వారికి ఉరిశిక్షే సరైనదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2012 డిసెంబరు 16న దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో తోటి విద్యార్థితో కలిసి వెళ్తున్న ఓ పారామెడికల్‌ విద్యార్థిపై ఆరుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేసిన విషయం తెలిసిందే. అత్యాచారం అనంతరం ఆ యువతిని రోడ్డు విూద విసిరేసి నిందితులు వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబరు 29 ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో యావత్‌ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో బాధితురాలిని నిర్భయగా పేర్కొంటూ దేశమంతా పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. నిర్భయ దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. కాగా.. ఈ కేసులో విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో అతడిని జువైనల్‌ ¬ంకు తరలించారు. మూడేళ్ల శిక్ష అనంతరం అతడు 2015లో విడుదలయ్యాడు.
కాగా.. విచారణ సమయంలో నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ 2013 మార్చి 11న పోలీస్‌ కస్టడీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబరులో మిగతా నలుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. 2017 మే 5న నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. కాగా.. ఈ శిక్షను సవాలు చేస్తూ దోషుల్లో ముగ్గురు ముద్దాయిలు పవన్‌, వినయ్‌, ముఖేశ్‌లు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. తమ శిక్షను తగ్గించి యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి వారికి ఉరిశిక్షే సరైనదని తేల్చింది. అయితే క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు మాత్రం వారికి అవకాశం కల్పించింది.
సుప్రిం తీర్పును స్వాగతిస్తున్నాం – నిర్భయ తల్లి ఆశాదేవి
నిర్భయ కేసులో దోషులకు మరణశిక్షను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును నిర్భయ తల్లి ఆశా దేవి స్వాగతించారు. తమ పోరాటం ఇంతటితో ఆగదని ఆమె అన్నారు. శిక్షను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసుపై గతంలో ఇచ్చిన తీర్పును  సోమవారం సుప్రీం సమర్థించింది. దీనిపై ఆమె స్పందిస్తూ శిక్ష అమలులో జాప్యం కారణంగా సమాజంలో ఇతర కూతుళ్లకు అన్యాయం జరుగుతోందన్నారు. న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆమె న్యాయశాఖను కోరారు. వీలైనంత తొందరగా దోషులకు ఉరి వేసి నిర్భయకు న్యాయం చేయాలని ఆశా దేవి డిమాండ్‌ చేశారు. దోషుల్లో ఎవరూ మైనర్లు లేరన్నారు. సుప్రీం తీర్పుతో తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత పెరిగిందని ఆమె అన్నారు. నిర్భయ కేసులో చివరకు న్యాయం జరిగిందని కిరణ్‌ బేడీ అన్నారు. నిర్భయ ఘటన చాలా క్రూరమైందన్నారు. సొమవారం సుప్రీం తీర్పు అనంతరం ఆ ఘటనను ప్రస్తావిస్తూ ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలో దర్యాప్తు చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్‌కు ఆమె థ్యాంక్స్‌ చెప్పారు. డీసీపీ
నీరజ్‌ కుమార్‌ నేతృత్వంలో సాగిన దర్యాప్తు వల్లే దోషులను త్వరగా పట్టుకోగలిగామన్నారు.