శిథిలాల కింద కొనప్రాణాలు

1

– నేపాల్‌లో కొనసా..గుతున్న సహాయ చర్యలు

ఖాట్మండ్‌,మే1(ఆర్‌ఎన్‌ఎ): భూకంప ధాటికి దాదాపు ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఓ మహిళ సజీవంగా బయటపడింది. నేపాల్‌లోని గాంగ్‌బూ గ్రామానికి చెందిన కృష్ణాదేవి ఖడ్కా జనసేవా అతిథి గృహంలో నివసిస్తోంది. నేపాల్‌లో ఏప్రిల్‌ 25న సంభవించిన భూకంప ధాటికి అతిథిగృహం కుప్పకూలి పోవడంతో కృష్ణాదేవి శిథిలాల్లో చిక్కుకుంది. అయినా అధైర్యపడకుండా సహాయక సిబ్బంది కోసం ఎదురుచూస్తూ ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడింది. ఇజ్రాయిల్‌కు చెందిన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా కృష్ణాదేవి కొనవూపిరితో కనిపించింది. సహాయక సిబ్బంది శిథిలాల నుంచి అమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గత శనివారం నేపాల్‌లో సంభవించిన భారీ భూకంప ప్రభావంలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఆరువేల మందికి పైగా మృతిచెందగా, వేలమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. నేపాల్‌లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరు రోజుల తర్వాత శిథిలాల కింద నుంచి మరో ఇద్దరిని సైన్యం సురక్షితంగా రక్షించింది. మరోవైపు భూకంపం తాకిడికి నేపాల్‌ నేలమట్టమైంది. పురాతన ఆలయాలు ధ్వంసమయ్యాయి. భూకంప ధాటికి మరణించిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. 15 వేలకు పైగానే చనిపోయి ఉంటారని అంచనావేస్తున్నారు. ఆర్మీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కొండచరియలు విరిగి పడి ధ్వంసమైన రోడ్లకు మరమ్మతుల చేస్తున్నారు. భూకంప కేంద్ర పరిసర గ్రామాలకు సైతం సహాయం అందిస్తున్నారు. వాహనాల్లో ఆహార పదార్థాలు తీసుకు వెళ్లి అందజేస్తున్నారు. ప్రపంచ దేశాల సాయం కూడా నేపాల్‌కు చేరుతోంది. ఎయిర్‌బస్‌లలో ఆహార పదార్థాలు, మెడిసిన్‌లను జర్మనీ దేశం నేపాల్‌కు పంపింది. రాజధాని ఖాట్మండ్‌లో శిథిలాల తొలగింపు వేగవంతమైంది. ఆరు రోజుల తర్వాత శిథిలాల కింద నుంచి మరో ఇద్దరి ఆర్మీ

రక్షించింది. ఇందులో ఒకరు యువకుడు కాగా, మరొకరు పదేళ్ల లోపు బాలుడు. వీరిద్దరికీ చికిత్స అందజేస్తున్నారు. వారు భూకంపం షాక్‌నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.వరుస భూకంపాలతో నేపాల్‌ అతలాకుతలమైంది. ఐదు రోజులు గడుస్తున్నా నేపాల్‌లో పరిస్థితులు కొలిక్కిరాకపోగా, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 6,200 మందికి పైగా మృతిచెందగా, 13,932మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య 15వేల వరకు పెరగొచ్చని నేపాల్‌ ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ గౌరవ్‌రానా తెలిపారు. శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత శనివారం 7.9 తీవ్రతతో నేపాల్‌లో సంభవించిన భూకంపం వేలాది మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే.