శిబిరాలకు తరలిన ఎంపిటిసి,జడ్పీటీసీలు

పోటాపోటీగా శిబిరాల ఏర్పాట్లు
రంగారెడ్డి,మే22(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలపై దృష్టిసారించాయి. వీలైనంత ఎక్కువ మంది ప్రాదేశిక సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమవైపు తిప్పుకొనేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను సవిూకరించి శిబిరాలు నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ కంటేముందే కాంగ్రెస్‌ పార్టీ మేల్కొనడం విశేషం. తమ అనుకూల ఓటర్లను జిల్లా దాటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీరిని బెంగళూరుకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమాచారం. అందరినీ ఒకేసారి తీసుకెళ్లడం కష్టమని భావించిన ఆ పార్టీ.. విడతల వారీగా ఓటర్లను శిబిరానికి చేర్చనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నిక జరిగే 31వ తేదీ ముందు రోజు వరకు అక్కడే బస చేసే వీలుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో  ఉండటంతో ఆ రాష్ట్రం సురక్షితమని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శిబిరం నిర్వహణకు బెంగళూరు నగరాన్ని ఎంచుకున్నట్లు కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత వెల్లడించారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోరు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే నడవనుంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులే తుది బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తలపడుతున్నారు.  ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రతాప్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన కొమ్మరెడ్డి ఉదయ్‌మోహన్‌రెడ్డి బరి నుంచి తప్పుకొన్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, శ్రమజీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్‌ తమ నామినేషన్లను ఉపసంహరించకున్నారు. దీంతో మహేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఇద్దరే పోటీలో నిలిచారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌కు భిన్నంగా వ్యవహరిస్తోంది. అందరినీ ఒకే చోటుకు చేర్చితే నిర్వహణ కష్టమని భావించిన ఆ పార్టీ.. మూడు చోట్ల క్యాంపు ఏర్పాటు చేసినట్లు సమాచారం.  బెంగళూరు, విశాఖపట్నంతోపాటు నగర శివార్లలోని ఓ ప్రాంతాన్ని ప్రాథమిక ఎంచుకున్నట్లు సమాచారం. ఎంటీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్‌.. ఇలా కేటగిరీలుగా విభజించి ఆయా నిర్దేశిత శిబిరాలకు తరలించారని సమాచారం.