శిల్పారామంలో సేంద్రియ ఫెస్టివల్‌

6 నుంచి పది వరకు ప్రదర్శన

హైదరాబాద్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): మాదాపూర్‌ శిల్పారమంలో సేంద్రియ ఎరువులతో పండించిన ధాన్యాలు, ఇతర ఆహార ఉత్పత్తులను ప్రదర్శించడంతోపాటు వాటి విశిష్టతపై సందర్శకులకు అవగాహన కల్పించనున్నారు. 2015 నుంచి ఈ మేళా నిర్వహిస్తుండగా.. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్నదని తెలిపారు. ఆర్గానిక్‌ రంగంలో ఉన్న మహిళా రైతులు, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ఈనెల 6 నుంచి 10 వరకు మహిళా జాతీయస్థాయి సేంద్రియ మేళా జరుగనున్నది. శిల్పారామంలో కేంద్ర, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలు సంయుక్తంగా 7వ సేంద్రియ ఉత్పత్తుల మేళా-2019 నిర్వహిస్తున్నాయి. ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా ఆర్గానిక్‌ ఫెస్టివల్‌ పేర దీనిని నిర్వహించనున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా హైదరాబాద్‌లో సేంద్రియ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తోంది. సేంద్రియ వ్యవసాయరంగంలో ఉన్న మహిళలు, వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను ఈ మేళాలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ మేళాకు సంబంధించిన పోస్టర్లను తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్‌, సంచాలకులు విజయేంద్ర బోయిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల పట్ల ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మహిళా రైతులు హాజరవుతారని, మొత్తం 150 స్టాళ్లలో వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. సేంద్రియ ఆహార వంటకాలను సైతం ఇక్కడ రుచిచూపించేందుకు ఫుడ్‌స్టాళ్లు ఉంటాయని తెలిపారు. ఐదురోజుల పాటు ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.