శివునిపల్లి గామస్తులు ఎన్నికల బహిష్కరణ
ఎస్టీకి కేటాయించడంపై గ్రామస్థుల ఆగ్రహం
జనగామ,జనవరి24(జనంసాక్షి): ఈనెల 30న మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సైతం నామినేషన్ల ఉపసంహరణ పక్రియ ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. పంచాయతీ రిజర్వేషన్ ఎస్టీకి కేటాయించడాన్ని నిరసిస్తూ స్టేషన్ మండలంలోని శివునిపల్లి గామస్తులు ఎన్నికలను బహిష్కరించడంతో ఒక్క నామినేన్ కూడా దాఖలు కాలేదు. ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ మైక్ హంగామా లేకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకొని తమను గెలిపిస్తే గ్రామానికి ఏం చేస్తామో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తుది విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తియ్యని మాటలతో పలకరిస్తూ రాని వారి మొబైల్ నంబర్లు తీసుకొని కుశల ప్రశ్నలతో అభ్యర్థులు ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. 30న మూడో విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో సైతం అభ్యర్థులు తమ ప్రచార వేగాన్ని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.మూడో దశ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసింది. చివరి దశలో స్టేషన్ చిల్పూర్, జఫర్ పాలకుర్తి మండలాల్లో 92 సర్పంచ్, 874 వార్డు స్థానాలకు ఈనెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. కాగా,మిగిలిన 91 గ్రామ పంచాయతీలకుగాను 16 ఏకగ్రీవం కాగా మిగిలిన 75 పంచాయతీలకు 242 మంది, మొత్తం 874 వార్డు స్థానాలకుగాను 217 ఏకగ్రీవం కాగా, మిగిలిన 657 వార్డులకు 1644 మంది బరిలో మిగిలారు. వీరికి గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగారు.