శునకానికి( లక్కీ) కి దహన సంస్కారాలు
వరంగల్ ఈస్ట్, జూలై 15 (జనం సాక్షి)
మూగజీవాలపై ఉన్న ప్రేమ ఎంతో గొప్పది. అవి మనతో ఉన్నప్పుడు మన మధ్యనే ఆడుతూ పాడుతూ కలియ తిరుగుతున్నప్పుడు పొందే ఆనందం వెలకట్టలేనిది. అయితే అవి మన నుంచి దూరమైనప్పుడు మిగిల్చే బాధ అంతా ఇంతా కాదు. ఇలాంటి సంఘటనే వరంగల్ నగరంలోని కాశబుగ్గలో శనివారం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే వందన ఫోటో స్టూడియో యజమాని మోత్కూరు ఉపేందర్ శోభారాణి దంపతులు 13 సంవత్సరాలుగా ఒక శునకాన్ని (లక్కీ) ని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా అల్లారుముద్దుగా సాదుకోవడం జరుగుతుంది. అయితే హఠాత్తుగా వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇది గమనించిన ఉపేందర్ శోభా దంపతులు వెంటనే సమీపంలో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది స్కానింగ్ ఇతర రక్త పరీక్షలు చేసి తగిన మందులు ఇచ్చారు. అయితే కొంతమేర ఆరోగ్యం మెరుగుపడినట్లు కనిపించిన శునకం(లక్కీ) శరీరంలో ఉండే భాద మాత్రం తగ్గలేదు. అయితే శుక్రవారం యధావిధిగా రాత్రి పడుకున్న శునకం (లక్కీ) తెల్లారేసరికి నిర్జీవిగా మారిపోయింది. ఏం చేయాలో అర్థం కాక కుటుంబ సభ్యులు బోరుణ విలపించారు. మృత్యువు ఒడిలోకి చేరిన శునకం (లక్కీ)ని మనుషులకు ఎలాగైతే దహన సంస్కారాలు చేస్తారో అదే పద్ధతిన అదే సాంప్రదాయం ప్రకారం స్థానిక తిలక్ రోడ్ లోని స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు బంధువుల తో కలిసి దహన సంస్కారాలు చేయడం జరిగింది. మనుషుల మీద ఉన్న ప్రేమ కంటే జంతువుల మీద ఉండే ప్రేమ ఎంత గొప్పదో ఈ సంఘటన ద్వారా తెలిసింది. గత 13 సంవత్సరాలుగా కుటుంబ సభ్యుల మధ్యనే ఉన్న (లక్కీ) దూరం అవడం జీర్ణించుకోలేకపోతున్నారు.